బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరో తెలుసా?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీదున్న సమయంలో అధ్యక్షుడిని మార్చడంతో పార్టీ దెబ్బతిన్నది
By: Tupaki Desk | 7 Dec 2023 4:20 AM GMTతెలంగాణలో భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీదున్న సమయంలో అధ్యక్షుడిని మార్చడంతో పార్టీ దెబ్బతిన్నది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాదయాత్రలు నిర్వహించి పార్టీలో మంచి జోష్ నింపారు. ఒక దశలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ధోరణికి తీసుకొచ్చారు. కానీ ఏమైందో ఏమో కానీ రాష్ట్ర పార్టీలో మార్పులు చేశారు. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు. దీంతో పార్టీ అగాధంలో పడిపోయింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం దక్కింది.
సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసింది. కేంద్ర మంత్రిగా అదనపు బాధ్యతలు ఉండటంతో పార్టీ వ్యవహారాలను సరిగా నిర్వహించలేకపోయారు. దీంతో పార్టీ అనుకున్న స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. పార్టీ అబాసుపాలైంది. ముఖ్య నేతలే ఓటమి పాలయ్యారు. పరువు కాస్త గంగలో కలిసింది. తాము తోడుకున్న బొందలో తామే పడినట్లు భావించుకుంటున్నారు. బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించకపోతే పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని ప్రతి ఒక్కరి వాదన.
ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. జంట పదవులు నిర్వహించడం కష్టంగా మారిందనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్ష పదవికి టాటా చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే కిషన్ రెడ్డి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో అధ్యక్షుడి మార్పు కొత్త ఊపు తీసుకువస్తుందని అందరు ఆశిస్తున్నారు.
పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్ కే బాగుంది. బాధ్యతల నిర్వహణలో సమర్థంగా పనిచేసినట్లు అన్ని సర్వేలు తెలిపాయి. బీఆర్ఎస్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్ ను మార్చినట్లు మిగతా పార్టీలు ఆరోపణలు చేశాయి. ఇప్పుడు మళ్లీ సంజయ్ కే బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ పైనే పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు.
దక్షిణాదిలో పట్టు సాధించాలని చూసిన బీజేపీ ఆశలకు ఆదిలోనే గండిపడింది. బండి సంజయ్ ను అధ్యక్షుడిగా మార్చడం పార్టీకి మైనసే. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం తప్పటడుగు వేసి భారీ మూల్యం చెల్లించుకుంది. బంగారమైన కలను దూరం చేసుకుంది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ ఉండేది. ఆ అవకాశాలను చేజార్చుకుని ఇప్పుడు బాధ పడుతోంది. జరగాల్సిన నష్టం జరిగాక ఇక బాధపడితే ఏం లాభం అని అందరు చర్చించుకుంటున్నారు.