గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ రేసుగుర్రాలు
తాజాగా ఫైనల్ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన వారే. వరంగల్.. ఖమ్మం ఎంపీ సీట్లను మినహాయిస్తే మిగిలిన సీట్లకు అభ్యర్థుల్ని పైనల్ చేశారు.
By: Tupaki Desk | 14 March 2024 4:17 AM GMTలోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో విడుదల అవుతున్న పరిస్థితుల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేసే విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ ముందుగా ఉంటుంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల విషయానికి వస్తే తొలిజాబితాలో 9 సీట్లను ఫైనల్ చేసిన బీజేపీ.. తాజాగా సెకండ్ లిస్టులో ఆరుగురు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అయితే.. వీరిలో అత్యధికం ప్యారాచూట్ అభ్యర్థులే ఉండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఫైనల్ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన వారే. వరంగల్.. ఖమ్మం ఎంపీ సీట్లను మినహాయిస్తే మిగిలిన సీట్లకు అభ్యర్థుల్ని పైనల్ చేశారు.
ఇప్పటివరకు ఖరారు చేసిన 15 మంది అభ్యర్థుల్లో ఏడుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన మాధవీలత అయితే బీజేపీలో చేరలేదు. అయినప్పటికీ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా విడుదలైన ఆరుగురు అభ్యర్థుల్లో డీకే అరుణ.. రఘనందన్ రావులను మినహాయిస్తే మిగిలిన నలుగురు (సైదిరెడ్డి, సీతారాంనాయక్, గోడెం నగేశ్, గోమాస శ్రీనివాస్) ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం.
తొలి జాబితాలో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి మరో ఎంపీ పి. రాములు కుమారుడు భరత్ కు బీజేపీ టికెట్ల ఫైనల్ చేయటం తెలిసిందే. తాజా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొత్తం గెలుపే లక్ష్యంగా సాగిందే తప్పించి.. మరే ఇతర కారణం లేదన్నన మాట బలంగా వినిపిస్తోంది. ఈ తీరును సంప్రదాయ బీజేపీ నేతలకు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
పెండింగ్ లో పెట్టిన రెండు సీట్లలో వరంగల్ ఎస్సీ స్తానాన్ని మాదిగలకు కట్టబెడతారని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను పోటీకి దించుతారని చెబుతున్నారు. వాస్తవానికి ఆయన బీజేపీలో చేరాల్సి ఉంది. అయితే.. ఆయన పార్టీలో చేరకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవటం తెలిసిందే. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కుమార్తె కావ్యకు ఇచ్చిన నేపథ్యంలో.. ఆరూరి రమేశ్ కు బీజేపీ టికెట్ ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.