బండికి మంత్రి పదవి.. డ్యామేజ్ కంట్రోల్ చర్యనా?
తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించటం చూస్తే.. తెలంగాణలో కమలంపార్టీకి అధినాయకత్వం రిపేరు వర్కు మొదలు పెట్టినట్లుగా చెప్పాలి.
By: Tupaki Desk | 10 Jun 2024 10:30 AM GMTఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే.. బండి సంజయ్ భాష అందరికి అంగీకారం కాకపోవచ్చు. కానీ.. ఆయన పోరాట స్ఫూర్తి మాత్రం ఆయన్ను వ్యతిరేకించేవారు.. ఆయన పేరు విన్నంతనే ముఖం చిట్లించే వారు సైతం ఆ పదవికి అర్హుడన్న మాట వినిపిస్తుంది. తన సారధ్యంలో తెలంగాణ బీజేపీని ఒక రేంజ్ కు తీసుకొచ్చిన బండికి.. పార్టీ చేసిందేమీ లేదని..ఆ మాటకువస్తే ఆయన్ను అవమానించినట్లుగా చర్చ జరిగింది. హైవే మీద వేగంగా దూసుకుపోయే వాహనం మాదిరి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఒక గుర్తింపు తీసుకొచ్చి.. నాటి అధికారపక్షానికి ప్రత్యామ్నాయంగా మార్చటంలో కీ రోల్ ప్లే చేస్తున్న బండి సంజయ్ ను హటాత్తుగా తెలంగాణ బీజేపీ రథసారధి పోస్టు నుంచి తీసేయటం.. కిషన్ రెడ్డిని ఎంపిక చేయటం తెలిసిందే.
ఊహించని షాక్ తిన్న బండి సంజయ్ తగ్గిపోవటం.. ఆయన్ను నిరుత్సాహం పూర్తిగా కమ్మేయటం తెలిసిందే. అప్పటివరకు పరిమితమైన పాత్రను పోషిస్తున్న ఆయనకు.. ఇన్నాళ్లకు సరైన గుర్తింపు లభించిందని చెప్పాలి. కేంద్ర మంత్రిగా కొలువు సొంతం చేసుకున్న ఆయన... ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సిన టైం వచ్చేసింది. పార్టీ అన్నా.. మోడీషాలన్నా విపరీతమైన విధేయతను ప్రదర్శించే బండి సంజయ్ కు తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించటం చూస్తే.. తెలంగాణలో కమలంపార్టీకి అధినాయకత్వం రిపేరు వర్కు మొదలు పెట్టినట్లుగా చెప్పాలి.
బండి సంజయ్ ను టీబీజేపీ అధ్యక్షుడి బాద్యతల్ని తప్పించిన తర్వాత బీజేపీ ఉత్సాహానికి బ్రేకలు పడటమే కాదు.. పార్టీ శ్రేణులు.. మద్దతుదారుల నీరసించి పోయాయి.దీంతో.. తెలంగాణ పార్టీలో జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేస్తూ.. రిపేరు వర్కును మొదలు పెట్టిన మోడీషాలు.. అందులో భాగంగా రాష్ట్రం నుంచి గెలుపొందిన ఎంపీల్లో రెండుసార్లు గెలిచిన పలువురిని పక్కన పెట్టి.. బండి సంజయ్ కు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా.. పార్టీలో పని చేసే వారికి గుర్తింపు లభిస్తుందన్న సందేశాన్ని ఇచ్చారని చెప్పాలి.