తెలంగాణ బీజేపీలో బీసీలను తొక్కేస్తున్నారా.. బండి, ఈటల, ఇప్పుడు విక్రమ్ గౌడ్..!
బండి సంజయ్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. అప్పుడే పార్టీ పతనం ప్రారంభమైంది.
By: Tupaki Desk | 13 Jan 2024 12:15 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తాం అన్న పదం నుంచి.. కనీసం 30 స్థానాలకు పైగా గెలుస్తాం.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాం అని భీరాలు పోయిన బీజేపీ చివరకు కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీ వేసిన రాంగ్ స్టెప్పులే తెలంగాణలో ఆ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో పతాలానికి పడిపోయేలా చేశాయి. బీసీ వర్గానికే చెందిన బండి సంజయ్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చినప్పుడు పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేనంత ఊపు రావడంతో పాటు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నంత ఊపు వచ్చేసింది.
బండి సంజయ్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. అప్పుడే పార్టీ పతనం ప్రారంభమైంది. బీసీలను పార్టీ అణగదొక్కేస్తుందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చినా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. బీసీ వర్గానికే చెందిన మరో నేత ఈటల రాజేందర్‌కు ముందు హైప్ ఇచ్చినా తర్వాత ఆయన్ను కూడా కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈటల కూడా పార్టీలో ఉండాలా ? బయటకు వెళ్లాలా ? అన్న ఆలోచన చేస్తున్న పరిస్థితి.
ఇక ఇప్పుడు పార్టీలో జరిగే అవమానాలు భరించలేక బీసీల్లో బలమైన వర్గానికే చెందిన కీలక నేత విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేసేశారు. హైదరాబాద్‌లో ఎంతో పట్టున్న దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అసలు పార్టీలో ఏం ఆశించకుండా.. అంకితభావంతో పనిచేసే నేతలకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కష్టపడుతోన్న తనలాంటి వారిని పార్టీలో అంటరాని వారిగా చూస్తున్నారంటూ ఆయన వాపోతోన్న పరిస్థితి.
పార్టీలో బలమైన బీసీ వర్గానికి చెందిన కష్టపడే నేతలను వాడుకోకపోవడం.. అవమానాల నేపథ్యంలో విక్రమ్ గౌడ్ కూడా పార్టీలో ఇమడ లేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన నేరుగానే తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఈ క్రమంలోనే విక్రమ్ గౌడ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో క్రమశిక్షణ మచ్చుకైనా కనపడడం లేదని.. తన లేఖలో విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు.
ఇక తెలంగాణ మహానగరంలో బలమైన బీసీ నేతగా ఉండడంతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్న విక్రమ్ గౌడ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు.. ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ విషయంలో క్లారిటీ లేదు సరికదా.. కనీసం పట్టించుకున్న నాథుడే లేకపోవడంతో ఆయన దారి ఆయన చూసుకున్నారు. ఇక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక కనీసం ఆ బాధ్యత కూడా ఎవ్వరూ తీసుకోలేదని విక్రమ్ వాపోయారు. ఏదేమైనా తెలంగాణ బీజేపీ నుంచి వరుసగా బీసీ నేతలు పార్టీని వీడుతుండడం చూస్తుంటే ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి. ఇప్పటకి అయినా తెలంగాణ బీజేపీ నాయకత్వం, దశ, దిశ మారకపోతే ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.