తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది ?!
శాసనసభలో ఎనిమిది స్థానాలు, లోక్ సభలో ఎనిమిది స్థానాలు గెలిచాం.
By: Tupaki Desk | 8 Aug 2024 9:17 AM GMTశాసనసభలో ఎనిమిది స్థానాలు, లోక్ సభలో ఎనిమిది స్థానాలు గెలిచాం. 2028 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి వస్తాం అంటూ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు గట్టిగా చెప్పారు. లోక్ సభ ఫలితాలు వెలువడి 60 రోజులు దాటింది. తెలంగాణ బీజేపీ అంతా చల్లబండింది అని పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి.
పార్టీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరి గోల వారిదే అన్నట్లుగా పరిస్థితి తయారయింది. శాసనసభ సమావేశాలలో బీజేపీ తరపున శాసనసభ్యులు మాట్లాడేందుకు అంశాలను సిద్దం చేసి శాసనసభకు వెళ్తే కనీసం లోపలికి వెళ్లడానికి పాసులు కూడా ఇవ్వలేదట. గంటల తరబడి అక్కడ నిలబడినా ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశారట.
తాజాగా బీజేపీ పదాదికారుల సమావేశంలో రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిర్వహించారు. తెలంగాణలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు మాత్రమే హాజరు కావడం విశేషం. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఎమ్మెల్యేలను ఆయన పట్టించుకోలేదట. రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని కనీసం ఎమ్మెల్యేలను గవర్నర్ కు పరిచయం చేయకపోవడంతో వీరంతా మనస్తాపానికి గురయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక రకంగా, కామారెడ్డి నుండి గెలిచిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఒకరకంగా, సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక రకంగా వ్యవహరిస్తుంటే, శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. అయితే రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే సమర్ధించడం కూడా చర్చకు దారితీసింది.
అటు శాసనసభతో పాటు ఇటు బయటకూడా రాష్ట్ర పార్టీకి, ఎమ్మెల్యేలకు నడుమ దూరం కొనసాగుతుందని, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు అసలు శాసనసభ్యులకు సమాచారం ఉండడం లేదని, ఇటీవల కిసాన్ సెల్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభానికి కూడా ఒక్క ఎమ్మెల్యే హాజరుకాకపోవడమే దీనికి నిదర్శనం అని అంటున్నారు.
కేంద్రమంత్రిగా, జమ్ముకాశ్మీర్ ఎన్నికల ఇంఛార్జ్ గా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బిజీగా ఉంటున్నారు. ఇక ఉన్న ఎనిమది మంది ఎమ్మెల్యేలు ఐదు గ్రూపులుగా విడిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీని గాడిన పెట్టేది ఎప్పుడు ? అధికారం అందుకునేది ఎప్పుడు ? అని పార్టీ శ్రేణులు మదనపడుతున్నాయి. ఈ సమస్యలను పార్టీ ఎలా పరిష్కరిస్తుందో వేచిచూడాల్సిందే.