ఏపీ రాజకీయాల 'బండి' మారుస్తారా?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి బీజేపీ అధిష్టానం ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Aug 2023 7:25 AM GMTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి బీజేపీ అధిష్టానం ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది.
ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కూడా ఉన్న బండి సంజయ్ కు బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు కార్యక్రమం బాధ్యతలను అప్పగించింది. ఇందులో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ తరఫున కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో అవకతవకలు తదితర అంశాలపై బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఆగస్టు 21న ఏపీలో పర్యటించనున్నారు. మరోవైపు ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ, బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచే ఈ పొత్తు కొనసాగుతున్నా ఇరు పార్టీలు కలిసి ఇప్పటివరకు ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది లేదు. ఈ నేపథ్యంలో ఏపీకి వస్తున్న బండి సంజయ్ జనసేన పార్టీని కూడా కలుపుకుని వెళ్తారా.. లేదంటే తన దారిలో తాను వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు జనసేన, బీజేపీ కూటమిలో కలవడానికి టీడీపీ కూడా సిద్ధంగా ఉంది. అయితే స్థానిక బీజేపీ నేతలు తమకు జనసేనతోనే పొత్తు ఉంటుందని, టీడీపీతో ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ ఏపీ పర్యటన ఆసక్తి రేపుతోంది.
ఇంకోవైపు ఏపీ బీజేపీ ఇంచార్జిగా సునీల్ ధియోదర్ ఉన్నారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యవహార శైలి, ఒంటెద్దు పోకడలు నచ్చకే కన్నా లక్ష్మీనారాయణ వంటివారు పార్టీ నుంచి బయటకు వచ్చేశారని టాక్ ఉంది. అలాగే సునీల్ ఏపీలో జగన్ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ ధియోధర్ ను ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జిగా తప్పిస్తారని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కే ఏపీ వ్యవహారాల ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అందులో ఏపీలోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది.
తెలంగాణలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆంధ్రాలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జిగా బండి సంజయ్ ను నియమిస్తే ఉభయతారకంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.