Begin typing your search above and press return to search.

బీజేపీ నేతలకు ఓటమి భయమా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల కోసం పార్టీలోని ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరించింది.

By:  Tupaki Desk   |   12 Sep 2023 8:58 AM GMT
బీజేపీ నేతలకు ఓటమి భయమా?
X

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు షాకివ్వాలని చూస్తోంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఆ దిశగానే బీజేపీ దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత ఆ పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ జోరు తగ్గిందని చెబుతున్నారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సూచనలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీలోని తెలంగాణ కీలక నాయకులు కూడా ఈ విషయాన్ని ముందే అర్థం చేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే అసెంబ్లీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోలేదని అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల కోసం పార్టీలోని ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరించింది. దీనికి ఏకంగా 6003 దరఖాస్తులు వచ్చాయి. టికెట్ కావాలంటే కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధిష్ఠానం కూడా స్పష్టం చేసింది.

కానీ కీలక నాయకులు మాత్రం ముందుకు రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా దరఖాస్తు సమర్పించలేదు. ఇంకా ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్, డీకే అరుణ, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి లాంటి ముఖ్య నేతలు టికెట్ల కోసం ఆర్జీ పెట్టుకోలేదు. వీళ్లలో కొంతమంది పేరు మీద కార్యకర్తలు దరఖాస్తులు సమర్పించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాగో బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఓటమి భయంతోనే ఈ నేతలు వెనక్కి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. అధికారం దక్కనప్పుడు పోటీ చేసి ఏం లాభమని? నాయకులు భావిస్తున్నట్లు టాక్. అంతే కాకుండా లోక్ సభ ఎన్నికలపైనే వీళ్లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గాలికి రాష్ట్రంలోనూ ఎంపీలుగా గెలవొచ్చన్నది వీళ్ల ప్లాన్ కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.