Begin typing your search above and press return to search.

హైడ్రాపై తలో మాట.. తెలంగాణ బీజేపీలో మహా గందరగోళం

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కేంద్రంలో కీలక మంత్రిగా ఉండగా.. మాజీ అధ్యక్షుడు సహాయ మంత్రిగా ఉండగా

By:  Tupaki Desk   |   27 Aug 2024 10:30 AM GMT
హైడ్రాపై తలో మాట.. తెలంగాణ బీజేపీలో మహా గందరగోళం
X

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కేంద్రంలో కీలక మంత్రిగా ఉండగా.. మాజీ అధ్యక్షుడు సహాయ మంత్రిగా ఉండగా.. ఎన్నడూ లేనంతగా తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల బలంతో ఉండగా.. కమలం రేకులు తలో దిక్కు చూస్తున్నాయి. అసలు అసెంబ్లీకే హాజరు కాని మాజీ శాసన సభా పక్ష నేత.. అసెంబ్లీ వద్ద శాసన సభా పక్ష నేత ప్రెస్ మీట్ జరుగుతుండగా.. రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకుల మరో ప్రెస్ కాన్ఫరెన్స్.. ఇలా అనేక లోపాలు.. చెప్పుకొంటూ పోతే ఇప్పటి హైడ్రా ఇంకాస్త పెద్ద ఉదాహరణ.

ఒక స్టాండ్ లేదా?

రాజకీయాల్లో పార్టీలకు ఒక స్టాండ్ ఉండడం కీలకం. ఏదైనా ఒక అంశంపై ఒకే తరహా వాదన వినిపించేందుకు ఇది దోహదపడుతుంది. అయితే, తెలంగాణ బీజేపీలో ఇదే లోపించినట్లు స్పష్టం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి అధికారంలోకి కచ్చితంగా వస్తామనే పార్టీకి ప్రజా సమస్యల పట్ల, ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల నిర్దిష్టమైన విధానం ఉండాలి. ఇక్కడే తెలంగాణ బీజేపీ గందరగోళంలో పడిపోయిందా? అనిపిస్తోంది.

ఈటల అలా..

గత ఆదివారం మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. పేదల జోలికి వెళ్తే సహించేది లేదని.. పెద్దల భవనాలను కూల్చివేస్తే సరేనని పేర్కొన్నారు. అసలు ఆక్రమణల లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. వామపక్ష, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల నుంచి వచ్చిన ఈటల తన స్పందనను అదే ధోరణిలో వెల్లడించారు. ‘కూల్చివేతలతో సామాన్యులను భయపెడుతున్నారా?.. నీ అయ్యా జాగీరా?’ అంటూ నిలదీశారు.

బుల్డోజర్లు ఎక్కించాలన్న రఘునందన్

‘‘పార్టీల జెండాలు చూడొద్దు.. అక్రమ నిర్మాణం అని తేలితే కూల్చేయండి. పెద్దలను వదిలి పేదల జోలికెళ్తే మాత్రం సహించేది లేదు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. చెరువులు, కుంటలను ఆక్రమించినవారు ఎంతటివారైనా వదిలొద్దు. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లను ఎక్కించేసేయండి’’ అని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిమాయత్‌ సాగర్‌ ఎఫ్‌ టీఎల్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌ లో వీఐపీలు, రాజకీయ ప్రముఖులు నిర్మించుకున్న కట్టడాలను కూల్చాలని డిమాండ్ చేశారు. హైడ్రా విధుల్లో రాజకీయ నేతలెవరూ జోక్యం చేసుకోవద్దని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ భవనాలను సైతం కూల్చివేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ఏలేటిది పాతబస్తీ మాట..

హైడ్రాపై బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ది మరో మాటగా ఉంది. ఆయన ఏకంగా పాతబస్తీపైనే ఫోకస్ పెట్టారు. `ఒవైసీ ఆక్రమణలను కూల్చివేసే దమ్ముందా?’ అని నిలదీశారు. సల్కం చెరువులో అసదుద్దీన్ ఒవైసీ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. వాటికి డెడ్ లైన్ ఎప్పుడని ప్రశ్నించారు. పాత బస్తీ ఆక్రమణల సంగతి ఏమిటని వ్యాఖ్యానించారు. కొంతమందినే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. ‘యంత్రాలు లేవంటే చెప్పండి.. మేం పంపిస్తాం’ అని అన్నారు.

ఆక్రమణల్లో బీజేపీ నేత..

హైదరాబాద్ శివారు గండిపేట చెరువు ఎఫ్టీఎల్ భూముల్లో మంథని నుంచి పోటీచేసిన బీజేపీ నేత పేరు కూడా రావడం గమనార్హం. ఈయనకు చెందిన నిర్మాణాలను కూడా గత వారం హైడ్రా కూల్చివేసింది. మరోవైపు దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరూ స్పందించడకపోవడం గమనార్హం. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ల పూర్తి స్థాయి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.