Begin typing your search above and press return to search.

టీ బీజేపీ అగ్రనేతల టికెట్లు ఫైనల్.. వారు బరిలోకి దిగేది ఇక్కడి నుంచేనా?

By:  Tupaki Desk   |   13 Aug 2023 6:48 AM GMT
టీ బీజేపీ అగ్రనేతల టికెట్లు ఫైనల్.. వారు బరిలోకి దిగేది ఇక్కడి నుంచేనా?
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వేళలో జరిగిన ఎన్నికలు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు ఒక లెక్క. మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికలు మరో లెక్కన్న మాట విపక్ష పార్టీలు చెబుతున్నాయి. అయితే.. ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాను అధికార బీఆర్ఎస్ ప్రదర్శిస్తోంది. అందుకు భిన్నంగా విపక్షాలు మాత్రం తమ సత్తాను ఈ ఎన్నికల్లో చాటాలని బలంగా భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎవరికి వారు వారి వ్యూహాల్ని.. అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో తాము బలపడినట్లుగా బీజేపీ చెబుతోంది. అందుకు తగ్గట్లే కొన్ని నెలల క్రితం వరకు అలాంటి పరిస్థితి ఉందన్న భావన వ్యక్తమైంది. అయితే.. కొద్దిరోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీ బీజేపీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. బీజేపీ అగ్రనాయకత్వంతో బీఆర్ఎస్ అధినాయకుడు సంధి చేసుకున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై వచ్చిన ఆరోపణలు ఒకదశలో జోరుగా సాగి.. ఆ వెంటనే వెనక్కి వెళ్లిపోవటానికి తెర వెనుక ఒప్పందమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

ఈ ఆరోపణలతో బీఆర్ఎస్ కన్నా టీబీజేపీకే ఎక్కువ డ్యామేజ్ గా మారాయి. ఈ ఆరోపణల్ని టీబీజేపీ బలంగా తిప్పి కొడుతోంది. ఈసారి ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు బలమైన షాక్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే తెలంగాణ బీజేపీ అగ్రనేతల స్థానాల్ని ఇప్పటికే ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కొందరు కీలక నేతలు బరిలోకి దిగే స్థానాలు మారిపోయినట్లుగా చెబుతున్నారు. ఇది ఆసక్తికరంగా మారింది.

రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ జాబితాను చూస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించిన పలువురిని ఈసారి అసెంబ్లీ బరిలో దించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్.. అర్వింద్.. ఇలా ఎంపీలందరిని అసెంబ్లీ స్థానాలకు బరిలోకి దించటం ద్వారా బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈటల రాజేందర్ ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేయాలని భావిస్తుండటం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు.. పలు వేదికల మీద చెప్పారు. బీజేపీ అధినాయకత్వం సైతం కేసీఆర్ మీద ఈటల పోటీ చేయటానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ లో ఎలా అయితే మమతా బెనర్జీ మీద ఆమెకు సన్నిహితుడిగా ఉండే సువేంద్ అధికారి పోటీ చేసిన చందంగా.. కేసీఆర్ పై ఈటల పోటీ చేస్తే అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే.. రాజేందర్ సన్నిహితులు మాత్రం కేసీఆర్ మీద పోటీ వద్దని.. ఎప్పటిలానే ఆయన ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నుంచే పోటీ చేయాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. రాజేందర్ ఏ నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి లోక్ సభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి కం టీ బీజేపీ రథసారధి కిషన్ రెడ్డి.. తాను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన అంబర్ పేట నుంచే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్ఠానం చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కిషన్ రెడ్డి సైతం సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక, నిజామాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్న ధర్మపురి అరవింద్ అయితే ఆర్మూర్ లేదంటే కోరుట్ల నుంచి పోటీ చేసే అవకాశాలు జోరుగా ఉన్నాయి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు వినయ్ కుమార్ రెడ్డికి ఆర్మూర్ కేటాయిస్తే మాత్రం.. అర్వింద్ కోరుట్ల నుంచి పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఇక, జితేందర్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఆయన మహబూబ్ నగర్ నుంచి లేదా షాద్ నగర్ నుంచి పోటీ చేసేందుకు వీలుగా అధినాయకత్వం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించి తెలంగాణలో పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్లి.. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ కరీంనగర్ లేదంటే వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు హైకమాండ్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును అయితే బోథ్ లేదంటే ఆసీఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి ఖాయమంటున్నారు. ఒకవేళ బాపూరావు కుమారుడ్ని బోథ్ నుంచి బరిలోకి దింపితే.. ఎంపీని ఆసిఫాబాద్ టికెట్ ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మిగిలిన వారికి భిన్నంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరారు. దీనికి ప్రతిగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి వీరోచితంగా పోరాడినా ఫలితం మాత్రం ఆయనకు అనుకూలంగా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో ఆయన మునుగోడు నుంచి పోటీ చేయాలని పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. అయితే.. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎల్ బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కోరుకున్నట్లుగా ఎల్ బీ నగర్ స్థానం ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ.. అసెంబ్లీ ఎన్నికల్లో తేడా కొడితే మాత్రం భువనగిరి ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

మాజీ మంత్రి డీకే అరుణను గద్వాల్ నుంచి పోటీ చేసేందుకు అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. తుది దశలో లెక్కలు మారితే మాత్రం మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక.. గోషామహాల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ, ఆ మధ్యన పార్టీ సస్పెన్షన్ కు గురైన రాజాసింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై ఉన్న వేటును తొలగించటం ద్వారా మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే విషయంలో ఒక కండీషన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన్ను ఈసారి అసెంబ్లీ బరిలో నుంచి కాకుండా ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు రాజాసింగ్ ఓకే అంటే పార్టీ సస్పెన్షన్ ఎత్తేసే వీలుందని చెబుతున్నారు. ఆయన్ను.. జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని తేల్చుకునే విషయంలో రాజాసింగ్ మల్లగుల్లాలు పడుతున్నట్లుగా సమాచారం.