తెలంగాణ బీజేపీ సీనియర్ల హ్యాండ్సప్.. టికెట్ కి దరఖాస్తే చేయలేదట
రేవంత్ రెడ్డి వంటి నాయకుడిని పీసీసీ చీఫ్ గా నియమించి ముందుకెళ్తున్న ఆ పార్టీ ఈసారి తమదే విజయం అని అంచనా వేసుకుంటోంది
By: Tupaki Desk | 7 Sep 2023 4:30 PM GMTదారితెన్నూ లేని నావలా ఉంది తెలంగాణ బీజేపీ పరిస్థితి. ఆరు నెలల కిందటి వరకు అధికారంలోకి వచ్చేస్తున్నమంటూ హడావుడి.. మూడు నెలల కిందటి వరకు అధికారం ఇక మనదే అనేంత దూకుడు.. కానీ, ఇప్పుడు మాత్రం ఎన్నికల ముంగిట ఓ విధమైన స్తబ్ధత. నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనంగా రాష్ట్ర నాయకత్వ మార్పు మేలా? చేటా? అనేది తెలియని పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లే బండి సంజయ్ ను తప్పించి.. కాస్త ఆచితూచి వ్యవహరించే కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఒకవిధంగా ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో కత్తి దూసే బీజేపీయేనా? ఇది అనే అనుమానం కూడా మొదలైంది.
మిగతా పార్టీలు అలా.. బీజేపీ ఇలా
తెలంగాణలో ఎన్నికలకు మరెంతో సమయం లేదు. కేవలం మూడు నెలల్లోపే అసెంబ్లీకి పోలింగ్ జరగాలి. ఎందుకంటే 2018లో తెలంగాణ ప్రభుత్వ సారథిగా సీఎం కేసీఆర్ డిసెంబరు 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన చూస్తే కొత్త ప్రభుత్వం వచ్చే డిసెంబరు 12లోగా ఏర్పడాలి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చాలా రోజుల కిందటే ప్రకటించారు. అందులోనూ 119 నియోజకవర్గాలకు గాను 115 స్థానాలకు ప్రకటించేశారు. అంటే ఓ విధంగా బీఆర్ఎస్ పోటీకి అంతా సిద్ధమైపోయింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ది మరో విధమైన పరిస్థితి. తెలంగాణ ఇచ్చినా.. దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
రేవంత్ రెడ్డి వంటి నాయకుడిని పీసీసీ చీఫ్ గా నియమించి ముందుకెళ్తున్న ఆ పార్టీ ఈసారి తమదే విజయం అని అంచనా వేసుకుంటోంది. దీనికితగ్గట్లే అభ్యర్థుల ఎంపికలో అత్యంత పకడబ్బందీగా వ్యవహరిస్తోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరింది. వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తులను వడపోత ప్రక్రియ సాగిస్తోంది. కాంగ్రెస్ టికెట్ లకు ఎంత గిరాకీ ఉందంటే.. ఇల్లందు వంటి ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గానికి ఏకంగా 38 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాలేరు వంటి జనరల్ స్థానంలో 15 మంది టికెట్ అడుగుతున్నారు. బీజేపీలో మాత్రం అంతా ఉత్సాహభరిత వాతావరణం కనిపించడం లేదు.
సీనియర్లే దూరంగా ఉంటే ఎలా?
తెలంగాణ బీజేపీలో సీనియర్లకు కొదవలేదు. కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ది నాలుగు దశాబ్దాల సీనియారిటీ. బండి సంజయ్ వంటివారు ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చినవారు. జితేందర్ రెడ్డి 25 ఏళ్ల కిందటే ఎంపీ. చెప్పుకొంటూ పోతే చాలా మందే ఉన్నారు. రెండేళ్ల కిందట బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసినవారు. అయితే, కచ్చితంగా వీరనే కాకుండా.. సీనియర్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి నిరాసక్తత చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి పార్టీలో ఎంతటివారైనా ‘‘దరఖాస్తు చేసుకుంటనే టికెట్’’ అనే నిబంధన విధించారు. దీనికోసం రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ సైతం నెలకొల్పారు.
మూడు రోజుల్లో ఒక్కరూ దరఖాస్తు చేయలేదట..
మూడు రోజులైనప్పటికీ.. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టికెట్ దరఖాస్తుకు ఏర్పాటు చేసిన సెల్ లో కనీసం ఒక్క సీనియర్ నాయకుడు కూడా దరఖాస్తు ఇవ్వలేదట. ఈ విషయం కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ఎన్నికల బీజేపీ ఇన్చార్జి ప్రకాశ్ జావదేకర్ పరిశీలనలోనే బయటపడడం గమనార్హం. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. బుధవారం మంచి రోజంటూ కొందరు సీనియర్లు హడావుడిగా దరఖాస్తులు చేశారు. కాగా, బీజేపీ టికెట్ల కోసం బుధవారం ఒక్క రోజే 307 దరఖాస్తులు వచ్చాయట. మొత్తమ్మీద మూడు రోజుల్లో 667 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.