సీనియర్లు బ్యాక్ స్టెప్ వేశారా ?
By: Tupaki Desk | 29 Sep 2023 5:30 PM GMTతెలంగాణ బీజేపీలో వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నేతలందరూ కచ్చితంగా నియోజకవర్గాలకు దరఖాస్తులు చేసుకోవాల్సిందే అనే నిబంధనను విధించింది నాయకత్వం. ఈ నిబంధన ప్రకారమే 119 నియోజకవర్గాలకు సుమారు 6 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే కీలకంగా ఉన్న కొంతమంది సీనియర్లు మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తులు చేసుకోని వారిలో కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, బాబూరావు కూడా ఉన్నారు.
వీళ్ళెందుకు దరఖాస్తులు చేసుకోలేదనే విషయం కొద్దిరోజులుగా పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే తాజా కబురు ఏమిటంటే వీళ్ళెవరికీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టంలేదట. కారణం ఏమిటంటే గెలుపుపై నమ్మకంలేదే అని పార్టీవర్గాల సమాచారం. బీఆర్ఎస్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి తాము ఈజీగా గెలుస్తామని ఒకపుడు చాలామంది అనుకున్నారు. అయితే తాజా పరిస్ధితుల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ వ్యతిరేకత అంతా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుందే కానీ బీజేపీ కాదనే ప్రచారం పెరిగిపోతోంది.
ఈ నేపధ్యంలోనే కిషన్ రెడ్డి, అర్వింద్, బండి సంజయ్ మళ్ళీ సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్ధానాలకే పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్ నుండి గెలిచిన సోయం బాబూరావు ఏమి చేస్తారో క్లారిటీ లేదు. ఎంపీలతో పాటు సీనియర్లందరినీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని జాతీయ నాయకత్వం స్పష్టంగా ఆదేశించింది.
కారణం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గట్టి అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది. పార్టీ నేతలు మీడియాలో ఎంత చెప్పుకున్నా చాలా నియోజకవర్గాల్లో పోటీకి గట్టి అభ్యర్ధులు దొరకటం కష్టమే. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మహాయితే ఓ 35 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరికితే దొరకచ్చంతే. మరి మిగిలిన నియోజకవర్గాల్లో ఏమి చేయాలి ? గట్టి అభ్యర్ధులు పోటీచేయటం వేరు ఎవరినో ఒకళ్ళని పోటీచేయించటం వేరు. అందుకనే గట్టి వాళ్ళని అనుకున్న నేతలందరినీ అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని అగ్రనేతలు కచ్చితంగా చెప్పేశారు. మరి సీనియర్లేమో వెనకడుగు వేస్తున్నారట. చివరకు ఏమవుతుందో చూడాలి.