కిషన్ కు షాక్ తప్పదా ?
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో షాక్ తప్పేట్లు లేదు.
By: Tupaki Desk | 16 Sep 2023 1:30 PM GMTతెలంగాణా బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో షాక్ తప్పేట్లు లేదు. ఎందుకంటే ఇంతకాలం కిషన్ ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేయటానికి పలువురు కార్పొరేటర్లు దరఖాస్తులు చేసుకున్నారు. కార్పొరేటర్లతో పాటు సీనియర్ నేతలు కూడా దరఖాస్తులు చేసుకోవటంతో అంబర్ పేటకు ఎంత డిమాండ్ ఉందో అర్ధమవుతోంది. పోయిన ఎన్నికల వరకు పార్టీలో దరఖాస్తు విధానం లేదు. కాబట్టి చాలామంది ఢిల్లీ దాకా వెళ్ళి టికెట్ కోసం ప్రయత్నంచేసుకునే అవకాశం ఉండేదికాదు.
పైగా కేంద్ర నేతలు కూడా హైదరాబాద్ కు వచ్చేది తక్కువే కాబట్టి ఆ స్ధాయిలో ఇక్కడివాళ్ళకు పరిచయాలు కూడా తక్కువే. కానీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకంతో జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు రెగ్యులర్ గా హైదరాబాద్, తెలంగాణాలో తిరుగుతున్నారు. దాంతో చాలామంది ద్వితీయ శ్రేణినేతలకు పై స్ధాయిలో పరిచయాలు వచ్చేశాయి. దానికితోడు ఇపుడు దరఖాస్తుల విధానాన్ని ప్రవేశపెట్టారు.
అందుకనే అంబర్ పేటకే చెందిన కార్పొరేటర్లు కొందరు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారట. పైగా ఇదే విషయాన్ని స్వయంగా కిషన్ తోనే మాట్లాడారట. ఎందుకంటే అంబర్ పేట టికెట్ కోసం కిషన్ దరఖాస్తు చేసుకోలేదు. అందుకనే కార్పొరేటర్లకు ధైర్యం వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. కిందస్ధాయి కార్యకర్త నుండి అన్నీపదవులు అనుభవించేసి చివరకు కేంద్రమంత్రిగా ఎదిగిన కారణంగా అంబర్ పేట నియోజకవర్గాన్ని తమకు వదిలేయాలని కార్పొరేటర్లు డైరెక్టుగా కిషన్నే అడిగారట.
కిషన్ ఎందుకు అప్లై చేయలేదంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగానే పోటీచేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే తెలంగాణాలోపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తేలిపోయిందట. అందుకనే తాను సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసి అంబర్ పేట టికెట్ తన భార్యకు ఇప్పించుకునే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన కార్పొరేటర్లు టికెట్ తమలో ఎవరోకరికి ఇప్పించాలని గట్టిగా పట్టుబట్టారని పార్టీవర్గాలు చెప్పాయి. మరి ఈ పరిస్ధితుల్లో కిషన్ ఏమి చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.