రికార్డుల ఉద్యమ గడ్డలో.. ఉద్యమ పార్టీకి అభ్యర్థి కరువు?
తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నవారికే టికెట్ కేటాయించాలని భావిస్తోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ టికెట్ కు పోటాపోటీ నెలకొన్న చోట ఇప్పుడు పరిస్థితి ఇది.
By: Tupaki Desk | 11 April 2024 1:30 PM GMT3,92,574.. ఇదీ 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యం. ఇక 2015లో ఉప ఎన్నికలో 4,59,088 ఓట్ల మెజార్టీ.. 2019లో 3,50,298 ఓట్ల ఆధిక్యం.. ఉద్యమాల గడ్డలో ఉద్యమ పార్టీకి గత రెండు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ.. అలాంటిచోట ఆ పార్టీ ప్రస్తుతం అభ్యర్థిని వెదుకులాడుకునే పరిస్థితిలో ఉంది. కోరి టికెట్ ఇచ్చినా ఓ అభ్యర్థి కాదని వెళ్లిపోగా.. ఇలాంటివారికి కాకుండా అత్యంత నమ్మకస్తులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించే పరిస్థితి వచ్చింది.
ఉద్యమ నేలలో..
వరంగల్ అంటే మామూలు మాటలు కాదు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ నేలలో బీఆర్ఎస్ కు మొదటినుంచి బలం ఉంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అమితంగా ఇష్టపడే జిల్లా. అలాంటిచోట 2014లో తెలంగాణ వస్తున్న సమయంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి 3.92 లక్షల ఓట్లతో గెలిచారు. నాడు మెదక్ లో కేసీఆర్ కు వచ్చిన మెజారిటీ తర్వాత ఇదే అత్యధికం. 2015లో కడియంను కేబినెట్ లోకి తీసుకోగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ 4.59 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2019లో ఈయన 3.50 లక్షల ఓట్లతో నెగ్గారు.
సిటింగ్ జంప్.. టికెట్ దక్కినవారూ జంప్
సిటింగ్ ఎంపీగా ఉన్న దయాకర్ ఈ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాకిచ్చారు. టికెట్ వచ్చే అవకాశం లేదని భావించి కాంగ్రెస్ లో చేరిపోయారు. మరోవైపు టికెట్ దక్కించుకున్న కడియం కావ్య తండ్రితో కలిసి మరీ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇలాంటి పరిస్థితి రాకముందే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అయితే, అనూహ్య ఎదురుదెబ్బలతో మేల్కొన్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆచితూచి టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. పార్టీ పట్ల పూర్తి విధేయత, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నవారికే టికెట్ కేటాయించాలని భావిస్తోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ టికెట్ కు పోటాపోటీ నెలకొన్న చోట ఇప్పుడు పరిస్థితి ఇది.