తెలంగాణ బడ్జెట్.. ఆరు గ్యారెంటీలకే అత్యధిక నిధులు!
ఈ సందర్భంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
By: Tupaki Desk | 10 Feb 2024 8:02 AM GMTతెలంగాణకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కాంగ్రెస్ ప్రభుత్వపు తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని అన్నారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి సంతులిత అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపారు.
కాగా ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. ఆరు గ్యారెంటీలకు ఏకంగా రూ.53,196 కోట్లు కేటాయించారు. ఆరు గ్యారెంటీల తర్వాత పంచాయతీరాజ్ శాఖకు ఎక్కువ నిధులు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ శాఖకు రూ. 40,080 కోట్లు కేటాయించారు. ఆరు గ్యారెంటీలు, పంచాయతీరాజ్ తర్వాత సాగునీరు, ఎస్సీ సంక్షేమం, విద్య, వ్యవసాయ రంగాలకు అత్యధిక కేటాయింపులు చేశారు. తద్వారా విద్య, వ్యవసాయం, సంక్షేమం తమ ప్రాధాన్యత రంగాలని ప్రభుత్వం చాటిచెప్పినట్టయింది.
కాగా గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి రూ.15 వేల కోట్లు తక్కువ పెట్టడం విశేషం. గతేడాది కేసీఆర్ ప్రభుత్వం 2,90,000 కోట్లకు బడ్జెట్ పెట్టింది.
రైతు బంధు పథకంపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులకు కూడా 15 వేల సాయం అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులు కూడా లబ్ధి పొందారని ఆరోపించారు. ఈసారి నిజమైన రైతులకు, కౌలు రైతులకు సాయం చేస్తామని తెలిపారు. ఈ మేరకు రైతుబంధు నిబంధనలను పునఃసమీక్షిస్తామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కింద ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందిస్తామని వెల్లడించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయానికి రూ.19,746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1,250 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు
బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు
విద్యుత్–గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు.
విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు
మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు అదనపు కేటాయింపు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.13,013 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు
టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్లు