బడ్జెట్ 2.91 లక్షల కోట్లు.. రేవంత్ సర్కారు తొలి పూర్తిస్థాయి పద్దు
తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టని రాష్ట్ర బడ్జెట్ రూ.2,91,159 కోట్లు.
By: Tupaki Desk | 25 July 2024 8:21 AM GMTఉమ్మడి ఏపీ విభజన తర్వాత అందరి కళ్లూ తెలంగాణ బడ్జెట్ మీదనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో..? హైదరాబాద్ వంటి నగరాన్ని కలిగి ఉండడమే దీనికి కారణంగా చెప్పాలి. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు. తెలంగాణ సొత్తుగా మారాక.. ఈ నగరం నుంచి వచ్చే ఆదాయం తెలంగాణకే చెందుతుంది. అంటే ఏపీకి ఆదాయం పంచాల్సిన అవసరం లేదు. మరోవైపు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఎలాంటి బడ్జెట్ ప్రవేశ పెడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ అంచనాలను నిలుపుకొనేలా తెలంగాణ బడ్జెట్ ఉన్నదా?
వ్యవసాయానికి పెద్దపీట..
తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టని రాష్ట్ర బడ్జెట్ రూ.2,91,159 కోట్లు. ఇందులో మూలధన వ్యయం రూ.33,487 కోట్లు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లు. కాగా.. ఈ ఏడాది రూ.57,112 కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రతిపాదించారు. బడ్జెట్ లో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దళిత సంక్షేమానికి ప్రాధాన్యం దక్కింది. ఇందుకు రూ.33,124 కోట్లు ఇచ్చారు. మూడో స్థానంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్ మెంట్ (29,816 కోట్లు) ఉండడం గమనార్హం.
నీటి పారుదుల, విద్యకు సమానంగా..
రేవంత్ ప్రభుత్వం ప్రాధాన్య రంగాలుగా భావిస్తున్న నీటిపారుదలకు బడ్జెట్ లో రూ.22,301 కోట్లు, విద్యకు రూ.21,292 కోట్లు ఇచ్చింది. ట్రాన్స్ కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు, ఉద్యానశాఖకు రూ.737 కోట్లు, పశు సంవర్ధవ శాఖకు రూ.1,980కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.17,056 కోట్లు,మైనార్టీ సంక్షేమం రూ.3,003కోట్లు, బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు, వైద్య, ఆరోగ్యం రూ.11,468 కోట్లు, అడవులు, పర్యావరణం రూ.1,064 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు కేటాయించింది.
సిలిండర్ పథకానికి..
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలకమైన రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రేవంత్ సర్కారు తొలి పద్దులోనే భారీగా నిధులిచ్చింది. దీనికి రూ. 723 కోట్లు ఇవ్వనుంది. గృహజ్యోతికి రూ.2,418 కోట్లు, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836 కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు రూ.1,525 కోట్లు, హోం శాఖకు రూ.9,564 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు ఇచ్చింది.
బడ్జెట్ లో మూల ధన వ్యయం రూ.33 వేల 487 కోట్లుగా పేర్కొన్న రేవంత్ ప్రభుత్వం.. తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్ల అప్పు ఉందని వెల్లడించింది. తమ ప్రభుత్వం వచ్చాక రూ.42 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు చెప్పింది.