బడ్జెట్ : రేవంత్ × కేటీఆర్ !
ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించాడు. "అయ్యలు, తాతల పేర్లు చెప్పుకుని వచ్చారని సీఎం రేవంత్ అంటున్నారు.
By: Tupaki Desk | 24 July 2024 10:29 AM GMTతెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తున్నది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శాసనసభలో చర్చ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని, కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో సభకు రాకపోవడం ఏంటని ? మోడీని చూసి భయపడుతున్నాడా ? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు.
"నేను అయ్యలు, తాతల పేర్లు చెప్పుకుని పైకి రాలేదని, స్వశక్తితో ఎదిగానని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ అభిప్రాయం చెప్పాలని, ఢిల్లీకి వెళ్లి చీకటి ఒప్పందం చేసుకున్నారని, చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని" రేవంత్ ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించాడు. "అయ్యలు, తాతల పేర్లు చెప్పుకుని వచ్చారని సీఎం రేవంత్ అంటున్నారు. ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి అంటున్నారా ? సభలో స్పీకర్ విపక్ష సభ్యులకు మాత్రమే చెబుతున్నారని, అధికార పార్టీని వారించడం లేదు. సీఎంకు ఓపిక ఉండాలి.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద చర్చను పూర్తిగా సమర్ధిస్తున్నాం. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపితే తెలంగాణకు దక్కింది గుండు సున్నా. అక్కడ బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడమే దీనికి కారణం" అని అన్నాడు. తెలంగాణ హక్కులు కాలరాసేందుకు ఎవరు ప్రయత్నించినా పోరాడుతామని, సభా నాయకుడు నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించాడు.