మరో '2' గ్యారెంటీలకు టీ కేబినెట్ ఓకే.. అమలు ఎప్పుడంటే?
మంత్రివర్గ భేటీ అనంతరం సమావేశ వివరాల్ని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మీడియాకు తెలియజేశారు.
By: Tupaki Desk | 5 Feb 2024 4:36 AM GMTఅధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట మీద నడుస్తోంది. ఎన్నికల్లో గెలిచి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే తొలుత రెండు గ్యారెంటీ హామీలను అమలు చేయటం తెలిసిందే. కట్ చేస్తే.. ప్రభుత్వం కొలువు తీరిన 60 రోజుల్లోనే మరో రెండు గ్యారెంటీ హామీలను అమలు చేసేందుకు వీలుగా తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా అమలు చేసేందుకు ఓకే చేసిన రెండు గ్యారెంటీ హామీల్ని చూస్తే..
1. ఇంటి అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు
2. రూ.500లకే గ్యాస్ సిలిండర్ల అందజేత పథకం
ఈ రెండింటితో పాటు.. ఈ నెల 8నుంచి అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాలని.. 10 నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని తీర్మానించింది. ఇప్పటికే అమలు చేసిన మరో రెండు గ్యారెంటీ హామీల్లో ఒకటి ఆరోగ్యశ్రీను రూ.10 లక్షలకు పెంచటం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం. ఈ రెండు ఇప్పటికే అమలవుతున్నాయి. ఆదివారం బీఆర్ఎ అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. మంత్రివర్గ భేటీ అనంతరం సమావేశ వివరాల్ని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మీడియాకు తెలియజేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నం రాజరిక పాలనను గుర్తుకు తెచ్చేలా ఉందని దాన్ని మార్చటం.. తెలంగాణ ప్రాంత గుర్తులు కనిపించేలా చేయటం.. తెలంగాణ పోరాటం.. అందులో జైలుకు వెళ్లిన వారిని గుర్తుకు తెచ్చేలా చేస్తామని చెబుతున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంతో పాటు.. రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ప్రజాకవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా చేస్తూ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమకాలంలో ఉర్రూతలూగించి.. తెలంగాణ సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతానికి తగిన గౌరవం ఇవ్వాలని రేవంత్ సర్కారు డిసైడ్ చేసింది. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీజీగా ప్రకటించారు. కానీ.. వాటిని పట్టించుకోకుండా కేసీఆర్ సర్కారు తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీ స్థానంలో టీఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయించారు.
కొండగల్ ప్రాంత అభివ్రద్ధికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానం చేయటంతో పాటు.. రాష్ట్రంలోని ప్రభుత్వానికి చెందిన 65 ఐటీఐలను ఆధునికీకరించి.. వాటిల్లో యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సుల్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించటంతో పాటు.. ఈ విషయంలో విద్యార్థులు.. ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాన్నితాము గుర్తించామని.. ఆ సమస్యకు త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని.. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టులు.. మెగా డీఎస్సీ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లుగా పేర్కొన్నారు.