Begin typing your search above and press return to search.

కేసీయార్ అలా ఎలా అంటారు ?

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అంటే కేసీయార్ దృష్టిలో బహుశా పార్లమెంటు మాత్రమే అనుకుంటున్నారేమో.

By:  Tupaki Desk   |   17 Sep 2023 5:18 AM GMT
కేసీయార్  అలా ఎలా అంటారు ?
X

కల్వకుంట్ల కవితే గురివిందగింజ అనుకుంటే ఆమే కాదు తాను కూడా గురివిందగింజనే అని కేసీయార్ నిరూపించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో పట్టుబట్టాలని కేసీయార్ బీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు. కేసీయార్ ఆదేశించారంటే బహుశా కూతురు కవిత కోసమే అయ్యుంటుంది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పట్టుబట్టాలని అన్ని పార్టీలకు కవిత లేఖలు రాసిన విషయం తెలిసిందే.

ఇక్కడే కవితతో పాటు తండ్రి, కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తనచేతిలో ఉన్న పనులు కేసీయార్ చేయరు కానీ అదే పని ఇతరులు చేయాలని మాత్రం డిమాండ్లు చేస్తుంటారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అంటే కేసీయార్ దృష్టిలో బహుశా పార్లమెంటు మాత్రమే అనుకుంటున్నారేమో.

చట్టసభలు అంటే పార్లమెంటుతో పాటు అసెంబ్లీలు కూడా అని కేసీయార్ కు తెలీదా ? చట్టసభల్లో 33 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చే రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కేసీయార్ ఏరోజైనా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లిచ్చారా ?

2014 ఎన్నికల్లో, 2018లోనే కాదు చివరకు మొన్ననే ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కూడా 33 శాతం రిజర్వేషన్ లేదు. 33 శాతం రిజర్వేషన్ అంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో 39 మంది మహిళలకు కేసీయార్ టికెట్లు ఇవ్వాల్సుంటుంది, మరంతమందికి టికెట్లిచ్చారా ? టికెట్లు ఇచ్చింది కేవలం ఏడంటే ఏడుగురికి మాత్రమే.

39 మందికి టికెట్లు ఇవ్వాల్సిన కేసీయార్ ఏడుగురికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తాను మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుచేయరు. తన తండ్రితో మహిళలకు రిజర్వేషన్ అమలుచేయించలేని కవిత ఇతరులను మాత్రం డిమాండ్లు చేస్తుండటమే విచిత్రం. అందుకే ఇంతకాలం కవిత మాత్రమే గురివిందగింజ అని అందరు అనుకున్నారు. కానీ ఇపుడు కూతురుతో పాటు తాను కూడా గురివిందగింజనే అని కేసీయార్ ప్రకటించుకున్నారు. తమచేతిలోని పనిని చేయలేని వీళ్ళు అదే పనిని ఇతరులు చేయాలని డిమాండ్లు చేయటమే చాలా ఆశ్చర్యంగా ఉంది.