వారం నుంచి తగ్గని జ్వరం.. కేసీఆర్ తాజా ఆరోగ్య పరిస్థితేంటి?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయటం తెలిసిందే
By: Tupaki Desk | 29 Sep 2023 5:09 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయటం తెలిసిందే. అప్పటికే కొద్ది రోజులుగా ఆయన వైరల్ ఫీవర్.. దగ్గుతో ఇబ్బందులకు గురవుతున్నారని.. ఆయన కోలుకోవటానికి కాసిన్ని రోజులు పడుతుందని అందులో పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే.. తాజాగా సైతం జ్వరం తగ్గలేదన్న విషయం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని సైతం జ్వరం ఇంతలా వెంటాడుతున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కారణం.. ఇటీవల కాలంలో వస్తున్న వైరల్ ఫీవర్ .. దగ్గు ఒకసారి వస్తే అలానే రోజుల తరబడి వెంటాడి వేధిస్తోంది. పలువురు సామాన్యులు ఈ వైరల్ ఫీవర్.. జలుబు కారణంగా తీవ్ర అవస్థల్ని ఎదుర్కొంటున్నారు. అదే పనిగా రోజులో గంటల కొద్దీ దగ్గుతూనే ఉండే పరిస్థతి. తాజాగా సీఎం కేసీఆర్ సైతం అందుకు మినహాయింపు కాదంటున్నారు. జ్వరం తగ్గకపోవటం.. నీరసంగా ఉన్న కారణంగా శుక్రవారం నిర్వహించాల్సిన రాష్ట్ర కేబినెట్ ను వాయిదా వేశారు.
అంతేకాదు.. ఎప్పుడు నిర్వహిస్తారో కూడా చెప్పని పరిస్థితి. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని చూస్తే.. వచ్చే నెల 6న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న మాట బలంగా వినిపిస్తుంది. అంటే.. మరో వారం మాత్రమే ఉన్న నేపథ్యంలో కేబినెట్ భేటీ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ వాయిదా వేయటమంటే.. కేసీఆర్ అనారోగ్య తీవ్రతను చెప్పేస్తుందని చెప్పాలి. జ్వరం ఉండి.. అది కూడా వారం దాటిన తర్వాత అంతో ఇంతో రికవరీ అవుతారు. అదే జరిగితే.. కేబినెట్ భేటీ ఖాయంగా ఏర్పాటు చేస్తారు.
కానీ.. అలాంటిదేమీ లేకుండా వాయిదా వేయటమంటేనే.. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు కాస్త ముందుగానైనా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాన్నిగంపగుత్తగా తీసుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలకమైన ఆరు హామీలు ఇస్తున్న కాంగ్రెస్.. సామాన్యుల్ని ఆకర్షిస్తోంది. వాటికి చెక్ పెట్టేలా కేసీఆర్ సర్కారు నిర్ణయాలు కేబినెట్ భేటీ సందర్భంగా వెలువడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.