Begin typing your search above and press return to search.

సిత్రం: బ్రాండ్ న్యూ కారులో మాజీ సీఎం.. పాత కారులో సీఎం

ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు పలువురు పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ భవనానికి వచ్చేసరికి అక్కడ ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి

By:  Tupaki Desk   |   2 Feb 2024 4:22 AM GMT
సిత్రం: బ్రాండ్ న్యూ కారులో మాజీ సీఎం.. పాత కారులో సీఎం
X

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెలువడిన యాభై రోజుల (దగ్గర దగ్గర) తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా చోటు చేసుకున్న సిత్రాలకు కొదవ లేదనే చెప్పాలి. ఎమ్మెల్యేగా తన ప్రమాణస్వీకార వేళ.. హడావుడికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఏర్పాట్లు చేసుకున్న ధోరణి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు పలువురు పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ భవనానికి వచ్చేసరికి అక్కడ ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

చెప్పిన సమయానికి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. అయితే.. ధగధగలాడే బ్రాండ్ న్యూ మెర్సిడెజ్ బెంజ్ కారులో వచ్చిన కేసీఆర్.. చేతి కర్ర సాయంతో అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. అక్కడ ప్రమాణస్వీకారం చేశారు. సాధారణంగా చేతిలో ఉన్న అధికారం కోల్పోయిన వారు వీలైనంత వరకు సాదాసీదాగా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ.. కేసీఆర్ మాత్రం అలాంటిదేమీ లేకుండా బ్రాండ్ న్యూ కారులో రావటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు మొత్తం అహంభావం.. మితిమీరిన హడావుడికి విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ఓటేశారన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ.. కేసీఆర్ పాత తీరునే కంటిన్యూ చేయటం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ వీలైనంత సింఫుల్ గా ఉంటూ.. అనవసర ఖర్చుకు అవకాశం ఇవ్వకుండా ఉన్నదాన్లోనే సర్దేసుకుంటున్న తీరుకు భిన్నంగా కేసీఆర్ తీరు కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

సాధారణంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చే మార్పు.. తాము వాడే వాహన శ్రేణిని బ్రాండ్ న్యూగా మార్చేయటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా రేవంత్ మాత్రం తన సొంత కారునే వినియోగించటం తెలిసిందే. కాన్వాయ్ గా భారీ వాహన శ్రేణి కూడా వద్దని చెప్పటం.. ఇందుకోసం కొత్త కార్లను గత ప్రభుత్వం ఎన్నికలకు ముందే కొన్నప్పటికీ.. వాటిని వాడాల్సిన అవసరం లేదని చెప్పేస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వారు వినియోగించే కారును బుల్లెట్ ఫ్రూప్ ఉండాలని అదికారులు చేసిన సూచనతో తన పాత కారునే బుల్లెట్ ఫ్రూప్ గా మార్చటం.. తన విదేశీ పర్యటనలో అందుకు తగ్గట్లు రిపేర్లు చేయించటం తెలిసిందే.

కనుసైగ చేస్తే కొత్త కారు వచ్చే అవకాశం ఉన్నా.. పాత కారు సరిపోతుందంటూ ఆచితూచి అడుగులు వేస్తున్న రేవంత్.. చివరకు తన కాన్వాయ్ లోని కార్ల రంగును మార్చాల్సి వస్తే.. కార్లు కాకుండా పాత కార్లకు బ్లాక్ కలర్ వేయించారు. ఇలా ఖర్చు చేసే ప్రతి పైసా ఆచితూచి అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరిస్తుంటే.. అందుకు భిన్నంగా ఓటమి పాలైన తర్వాత కూడా బ్రాండ్ న్యూ కారును వినియోగిస్తున్న కేసీఆర్ రాజసంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది.