కేసీఆర్ బుజ్జగింపులు పని చేయటం లేదా ?
ఇదే విషయమై కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే బుజ్జగింపులు ఏ మాత్రం పని చేయడం లేదు.
By: Tupaki Desk | 8 Sep 2023 5:16 AM GMTఇదే విషయమై కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే బుజ్జగింపులు ఏ మాత్రం పని చేయడం లేదు. కేసీయార్ టికెట్లు ప్రకటించి ఇప్పటికి రెండు వారాలవుతోంది. అప్పటినుండి టికెట్లు రాని ఏడుగురు సిట్టింగ్ ఎంఎల్ఏలతో పాటు చాలా నియోజకవర్గాల్లో ఆశావహులు మండిపోతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకెంతమంది చేరుతారో తెలీదు. ఎంఎల్ఏ రేఖానాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు, తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకేసారి ఇంతమందికి కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్లు ఇవ్వలేదు. పార్టీలో చేరబోయే కొందరికి మాత్రమే టికెట్లు ఇవ్వగలదు. ఈ విషయం తెలిసినా కూడా బీఆర్ఎస్ లో నుండి ఇంతమంది ఎందుకని కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారు ? ఎందుకంటే కేసీయార్ మీద మంటతో మాత్రమే అని అర్ధమవుతోంది. బీఆర్ఎస్ అసంతృప్తుల్లో చాలామందికి రాబోయే ఎన్నికల్లో కేసీయార్ కు గుణపాఠం చెప్పాలని బలంగా ఉంది. అందుకనే ఎంతమంది మంత్రులు వచ్చి బుజ్జగిస్తున్నా వినటంలేదు.
నిజంగానే ఆగ్రహంతో రగిలిపోతున్న అసంతృప్తులంతా పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరితే అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్ధులకు కష్టాలు తప్పవు. ఈ విషయంలో కేసీయార్ కు క్లారిటి బాగానే ఉంది. అందుకనే అసంతృప్తులను బుజ్జగించేందుకు పదేపదే మంత్రులను పంపుతున్నది. అందుకని చివరి అస్త్రంగా పార్టీ అధికారంలోకి రాగానే ఎంఎల్సీలు ఇస్తానని, రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధులుగా టికెట్లిస్తానని కబురు చేస్తున్నారు. అయితే అసంతృప్తుల్లో చాలామందికి కేసీఆర్ మాట మీద నమ్మకం లేదు.
అసంతృప్తుల కెపాసిటీ పై క్షేత్రస్ధాయి నుండి పూర్తి సమాచారాన్ని కేసీయార్ తెప్పించుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదే విషయమై రెగ్యులర్ గా పనిచేస్తున్నాయి. ఒకవేళ అసంతృప్తులు బలమైన నేతలైతే వారిని బ్యాలెన్స్ చేయటం ఎలా అనే ఆలోచనలో కూడా కేసీయార్ ఉన్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా ఇతర పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలకు గాలమేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరి కేసీయార్ బుజ్జగింపు ఏమవుతుంది ? అసంతృప్తుల ఆలోచనలు ఏ మేరకు వర్కవుటవుతుంది ? లాంటి అనేక అంశాలపై ఆసక్తి పెరిగిపోతోంది.