Begin typing your search above and press return to search.

జ్వరం తగ్గింది.. ఛాతీలో ఇన్ ఫెక్షన్.. కేసీఆర్ కు అసలేమైంది?

గతానికి భిన్నంగా పరిస్థితులు మారి.. సమాచారం ఏదైనా సరే బయటకు రావాలంటే.. వివిధ దశల్లో ఫిల్టర్ చేస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది

By:  Tupaki Desk   |   7 Oct 2023 5:16 AM GMT
జ్వరం తగ్గింది.. ఛాతీలో ఇన్ ఫెక్షన్.. కేసీఆర్ కు అసలేమైంది?
X

ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి ఆయన అనారోగ్యం బారిన పడినప్పుడు దానికి సంబంధించిన వివరాలు అప్పుడప్పుడు బయటకు రావటమేంటి? బయట ప్రపంచానికి కేసీఆర్ కనిపించి మూడోవారంలోకి ఎంట్రీ అయిన వేళ.. ఇప్పటివరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించి రెండో ప్రకటన.. అది కూడా మంత్రి కేటీఆర్ నోటి నుంచి యధాలాపంగా రావటం ఏమిటి? ముఖ్యమంత్రికి అనారోగ్యమైతే.. మరీ హైప్ అక్కర్లేదు కానీ సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది కదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గతానికి భిన్నంగా పరిస్థితులు మారి.. సమాచారం ఏదైనా సరే బయటకు రావాలంటే.. వివిధ దశల్లో ఫిల్టర్ చేస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి వేళ.. అనవసరమైన అనుమానాలు పెరిగే కన్నా.. వాస్తవ పరిస్థితులు ఇవన్న విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా? అలాంటిదేమీ లేకపోవటాన్ని తప్పు పట్టాల్సిందే. దాదాపు వారం క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం గురించి మొదటిసారి మాట్లాడారు.

అప్పట్లో ఆయన వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారని.. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. రెండు రోజుల క్రితం కేటీఆర్ కుమారుడు హిమాన్షు చేసినట్లుగా ఒక ట్వీట్ వైరల్ అయ్యింది. అందులో మిస్ యు తాతయ్య అని ఉండటం ఒక ఎత్తు అయితే.. అలాంటిదేమీ హిమాన్షు అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతాలో కనిపించకపోవటం చూస్తే.. ఎవరో కావాలని ఫేక్ పోస్టును వైరల్ చేస్తున్నారని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ముఖ్యమంత్రి అనారోగ్యం గురించి మరోసారి మాట్లాడారు. వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్న కేసీఆర్ కు జ్వరం తగ్గిందని.. ప్రస్తుతం ఛాతీలో ఇన్ ఫెక్షన్ వచ్చిందని పేర్కొన్నారు. వైరల్ ఫీవర్ తర్వాత ఛాతీలో బ్యాక్టిరియా ఇన్ ఫెక్షన్ మొదలైనట్లుగా చెప్పి.. ‘‘ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు’’ అని చెప్పటం చూసినప్పుడు.. కేసీఆర్ అనారోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే బాగుంటుంది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.