Begin typing your search above and press return to search.

కారు సారు కి కారే లేదు...కేసీయార్ ఆస్తులు ఇవేనా...?

కారు సారూ జోరూ ఇదే గులాబీ పార్టీ నినాదం. గత పదేళ్ళుగా ఆ స్లొగన్ ని గన్ గా చేసుకుని తెలంగాణాలో దూసుకుపోయింది

By:  Tupaki Desk   |   9 Nov 2023 3:26 PM GMT
కారు సారు కి కారే లేదు...కేసీయార్ ఆస్తులు ఇవేనా...?
X

కారు సారూ జోరూ ఇదే గులాబీ పార్టీ నినాదం. గత పదేళ్ళుగా ఆ స్లొగన్ ని గన్ గా చేసుకుని తెలంగాణాలో దూసుకుపోయింది. బీయారెస్ కి కారు గుర్తు బాగా అచ్చివచ్చింది. పోటీ చేసిన చోట విజయం దక్కింది. మరి కారు జోరు చేస్తుందే అంటూ కేసీయార్ ప్రతీ సభలో చెబుతూ ఉంటారు. అలాంటి కారు సారుకు సొంత కారు లేదాయే.

మరి ఈ విషయం ఆయనే స్వయంగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీయార్ గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా తనకు ఉన్న అస్తుల వివరాలను ఆయన బయటపెట్టారు. అందులో చూస్తే సారు వారికి కారు సొంతంగా లేదు అని తెలుస్తోంది.

ఇక కేసీయార్ పేరిట ఆస్తులు ఎన్ని ఉన్నాయంటే ఏకంగా 58.7 కోట్లు అని తేలింది. అదే విధంగా చూస్తే అందులో 35.42 కోట్ల రూపాయల విలువ చేసే చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చరాస్తుల జాబితాలో నగదు, డిపాజిట్లు, టీ న్యూస్ లో పెట్టుబడులు ఉన్నాయని లెక్క చెప్పారు.

అదే విధంగా 23.50 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్థులు ఉన్నాయని కూడా కేసీయార్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ విధంగా చూస్తే అవి ఇళ్ళు, ఫ్లాట్లు, ఫాం హౌస్ గా వివరించారు. ఇవే తన ఆస్తులు తప్ప ఇంతకు మించి ఏమీ లేవని కేసీయార్ స్పష్టం చేశారు. తన పేరిట ఎలాంటి వ్యవసాయ క్షేత్రాలు కానీ, కార్లు ఇతర వాహనాలు కానీ లేవని కేసీయార్ పేర్కొనడం గమనార్హం.

ఇక తన పేరిట 17.27 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయని కేసీయార్ వెల్లడించడం విశేషం. ఇక తన ఏడాది ఆదాయం 1.60 కోట్ల రూపాయలు అని కేసీయార్ వివరించారు. మొత్తానికి చూస్తే ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి. అప్పులు తక్కువగానే ఉన్నాయి. దాంతో కేసీయార్ కోటీశ్వరుడు శ్రీమంతుడు అని నిర్ధారణకు రావచ్చు.

అయితే దేశంలో ఉన్న ధనవంతుల సీఎంలలో కేసీయార్ కూడా ఒకరు అని ప్రత్యర్ధులు చేసే ప్రచారం తప్పు అన్నట్లుగా ఆయన అఫిడవిట్ ఉంది. తన ఆసులు అప్పులు లెక్క చూస్తే కేవలం 41 కోట్ల రూపాయలే నికర ఆస్తులు గా తేలింది. అంటే కేసీయార్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రి చేసినా డిప్యూటీ స్పీకర్ గా చేసినా అనేక పర్యాలలు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో సంపాదించింది అంతకంటే లేదు అని తేలుతోంది.

వీటన్నిటికంటే ఆసక్తి రేపే విషయం సొంత కారు లేకపోవడం. ఎన్నికల ప్రచారం కోసం రోజుకు మూడు సభలకు అటెండ్ అయ్యేందుకు హెలికాప్టర్ లో తిరిగే కేసీయార్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు ప్రత్యేక విమానం వాడే కేసీయార్ కి సొంత కారు లేకపోవడం చిత్రమే అంటున్నారు.