రాష్ట్రపతికి 'తెలంగాణ సీఎం' ఆహ్వానం.. మోదీ వస్తే..?
ఇక రాజకీయాలు విభేదంగా మారితే.. ప్రధాని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు ఏమాత్రం ఉండవు.
By: Tupaki Desk | 19 Dec 2023 3:30 PM GMTభారత్ ది సమాఖ్య వ్యవస్థ. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసుకెళ్తేనే ప్రగతి రథం ముందుకు కదులుతుంది. కానీ, ప్రజాస్వామ్యంలో వేర్వేరు రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇందుకు అవకాశం తక్కువ. అందులోనూ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం మరింతగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వాలు.. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిన చరిత్ర ఉంది. ఇక రాజకీయాలు విభేదంగా మారితే.. ప్రధాని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు ఏమాత్రం ఉండవు.
మోదీని ఢీకొట్టిన కేసీఆర్
కారణాలు ఏమైతేనేం..? తెలంగాణ ఏర్పాటు అనంతరం కొన్నాళ్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. ఇదంతా 2014-19 మధ్య వరకు నడిచింది. నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రయిక్స్ సహా పలు అంశాల్లో మోదీని కేసీఆర్ అభినందించారు. కానీ, ఆ తర్వాతి నుంచి పరిస్థితి మారింది. రాజకీయ విభేదాలో మరేదో కారణం కావొచ్చు కానీ.. నేరుగానే మోదీని విమర్శించసాగారు కేసీఆర్. బీజేపీ 2020లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాక రాజకీయంగా నేరుగా కేసీఆర్ ను ఢీకొన్నట్లు అయింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో ఉప ఎన్నికలు, జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన సమరం నడిచింది. ఇక 2022 నుంచి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక వైరం మరింత ముదిరింది అనుకోవచ్చు.
మోదీకి ముఖ్యమంత్రి ఆహ్వానమేది?
ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ పలుసార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఇందులో రాజకీయ పర్యటనలను మినహాయిస్తే.. ఆధ్యాత్మిక, డెవలప్ మెంట్ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించాలి. అయితే, రాజకీయ ఆలోచనలతోనో.. మరో కారణమో కానీ కేసీఆర్ ఆ పనిచేయలేదు. తన స్థానంలో.. హైదరాబాద్ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ ను పంపారు. ఇది ఒకసారి కాదు పలుసార్లు జరిగింది.. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ తెలంగాణకు రాగా కేసీఆర్ ఆహ్వానం పలికారు. ద్రైపది ముర్ము రాష్ట్రపతి అయ్యాక కూడా విమానాశ్రయానికి వెళ్లారు. అయితే, ఇది హోదా పరంగా తప్పనిసరి అయినందునే అని చెప్పాల్సిన పని లేదు.
మరి మోదీ వస్తే..?
అంశాలవారీ మద్దతు తప్ప.. తెలంగాణలో మొన్నటివరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మోదీ/బీజేకి వ్యతిరేకమనే సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు మరింత వైరం ఉన్న జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన సర్కారు తెలంగాణలో ఉంది. కేసీఆర్ ఆహ్వానం పలకకున్నా.. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి ఆహ్వానం పలుకుతారా? అనేది చూడాలి. రాష్ట్రపతి ముర్ము సోమవారం హైదరాబాద్ కు రాగా.. సీఎం రేవంత్ ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ వస్తే..? అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే.. రాజకీయాలను పక్కనపెట్టి రేవంత్ ప్రధాని మోదీకి స్వాగతం పలికే అవకాశమే ఎక్కువ.