Begin typing your search above and press return to search.

అత్తోరింటివైపు చూస్తున్న కేసీఆర్... కన్ ఫాం చేస్తోన్న సీనియర్!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 Aug 2023 7:33 AM GMT
అత్తోరింటివైపు చూస్తున్న కేసీఆర్... కన్ ఫాం చేస్తోన్న సీనియర్!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై కీలక చర్చ తెరపైకి వచ్చింది.

2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గ్రాండ్ విక్టరీ సాధించారు కేసీఆర్. ఈ సమయంలో మరోసారి అక్కడి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొడతారని కొంతమంది అంటుంటే... లేదు ఈసారి మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే!

అవును... బీఆరెస్స్ జాతీయ రాజకీయాల భవిష్యత్తును నిర్దేశించేవి, నిర్ణయించేవిగా రాబోయే ఎన్నికలను భావిస్తున్నారంట ఆ పార్టీ నేతలు. ఇదే క్రమంలో కేసీఆర్ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంలో మార్పు ఉంటుందని, ఈసారి కామారెడ్డి నుంచే పోటీ చేస్తారని అంటున్నారు.. ఆ పార్టీ కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్.

ఈ సమయంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ నూటికి నూరుశాతం కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఇదే సమయంలో తాను కేసిఆర్‌ ను కామారెడ్డిలో పోటీ చేయాలని మూడుసార్లు కోరినట్లు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తగా తాను ఉండి కేసీఆర్ ను గెలిపించుకుంటానని గంప గోవర్ధన్ చెప్పారు.

అలా ఎందుకు కోరుతున్నారు అనే కనిపించని కారణం సంగతి కాసేపు పక్కనపెడితే... కనిపించే కారణం కూడా బలంగా ఉంది. కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్ కేసీఆర్ అత్తగారి గ్రామం! దీంతో గంప గోవర్ధన్ చెప్పేది నిజమైతే ఈసారి కేసీఆర్ అత్తారింటి నుంచి పోటీ చేయబోతున్నారన్నమాట అని అంటున్నారు!

అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా.. లేక, గజ్వేలు ను ఆపి కామారెడ్డికి షిఫ్ట్ అవుతారా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది!

మరోపక్క రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఈసారి తెలంగాణ నుంచి ఒకచోట.. మహారాష్ట్ర లో రెండు చోట్లా పోటీ చేయబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేస్తే ఎలా ఉంటుందనే విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

టీఆరెస్స్ నుంచి బీఆరెస్స్ గా మారిన తర్వాతనుంచి కేసీఆర్ ఇలా ఏ విషయంలో నైనా మహారాష్ట్రను కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుండటం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల సంగతి కాసేపు పక్కనపెడితే... రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ అత్తారింటినుంచే పోటీ చేస్తారా.. గోవర్ధన్ చెబుతున్నట్లు కామారెడ్డి నియోజకవర్గాన్నే ఎన్నుకుంటారా అనేది వేచి చూడాలి.

కాగా.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ ఇప్పటివరకు అక్కడినుంచే ఐదుసార్లు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 1994, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపిందిన ఆయన... 2012, 2014, 2018 ఎన్నికల్లో టీఆరెస్స్ (బీఆరెస్స్) నుంచి గెలిచారు.