గజ్వేల్ నుంచే కేసీఆర్.. మారే ఛాన్స్ లేదు!
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ తొలిగిపోయినట్లే కనిపిస్తోంది.
By: Tupaki Desk | 13 Aug 2023 12:30 PM GMTతెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ తొలిగిపోయినట్లే కనిపిస్తోంది. ఆయన మరోసారి గజ్వేల్ నుంచే పోటీ చేయడం ఖాయమని టాక్. నియోజకవర్గం మారే ఆలోచనలో కేసీఆర్ లేనట్లు తెలిసింది. తన కంచుకోట గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయనకు అక్కడ పోటీ ఉండేలా కనిపించడం లేదు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి.. కేసీఆర్‌కు కాస్త పోటీనిచ్చారు. కానీ గత ఎన్నికల తర్వాత ప్రతాప్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో కేసీఆర్‌కు పోటీనిచ్చే నాయకుడు కనిపించడం లేదు. అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌కు పోటీగా బరిలో దిగుతామంటూ కాంగ్రెస్, బీజేపీలోని అగ్రనేతలు అంటున్నారు. కానీ ఎన్నికలు వచ్చేనాటికి ఆ పరిస్థితి ఉండదన్నది విశ్లేషకుల అంచనా.
అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ కాకుండా వేరే చోటు నుంచి పోటీ చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం హోరెత్తుతోంది. కామారెడ్డి, పెద్దపల్లి, మేడ్చల్‌లో ఏదో ఒక చోట నుంచి కేసీఆర్ బరిలో దిగుతారనే ఊహాగానాలు వినిపించాయి. కేసీఆర్ను కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు ఆహ్వానించానని అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా పేర్కొన్నారు. కానీ కేసీఆర్ మనసు మాత్రం గజ్వేల్ పైనే ఉందని తాజాగా తెలిసింది. ఎవరేమన్నా మరోసారి గజ్వేల్ నుంచి పోటీకి కేసీఆర్ సై అంటున్నారని సమాచారం.