రెండు పేర్లపై కేసీయార్ లో అయోమయం ?
రెండు ఎంఎల్సీ స్ధానాల విషయంలో కేసీయార్ ప్రభుత్వంలో అయోమయం పెరిగిపోతోంది.
By: Tupaki Desk | 17 Aug 2023 8:07 AM GMTరెండు ఎంఎల్సీ స్ధానాల విషయంలో కేసీయార్ ప్రభుత్వంలో అయోమయం పెరిగిపోతోంది. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్ధానాల్లో ఇద్దరు నేతలను క్యాబినెట్ ఆమోదించింది. ఇద్దరి పేర్లతో ఫైలును గవర్నర్ ఆమోదంకోసం రాజ్ భవన్ కు పంపింది. అయితే ఇంతవరకు రాజ్ భవన్ నుండి ఫైలుకు క్లియరెన్సు దొరకలేదు. జూలై 31వ తేదీన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఆమోదించింది. తర్వాత చీఫ్ సెక్రటరీ నుండి రాజ్ భవన్ కు ఫైలు వెళ్ళింది.
అంటే గడచిన 18 రోజులుగా ఆ ఫైలు గవర్నర్ సంతకం పడిగాపులు కాస్తోంది. మామూలుగా అయితే ప్రభుత్వం నుండి వెళ్ళిన ఫైలుపై గవర్నర్ ఒకటిరెండు రోజుల్లోనే సంతకం చేసేస్తారు. కానీ ఇక్కడ 18 రోజులు అవుతున్నా ఫైలును గవర్నర్ చూశారో లేదో కూడా తెలీటంలేదు. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని ఎంఎల్సీగా సిఫారసు చేసినపుడు కూడా ఇలాగే అయ్యింది. దాదాపు మూడునెలలు తన దగ్గరే ఫైలును ఉంచుకున్నారు. కౌశిక్ నియామకంపై గవర్నర్ అనేక సందేహాలను లేవనెత్తారు.
ఆయనపైన నమోదైన కేసుల వివరాలను కూడా గవర్నర్ ప్రస్తావించారు. దాంతో లాభంలేదని అనుకున్న కేసీయార్ చివరకు కౌశిక్ ప్రతిపాదనను విరమించుకుని తర్వాత ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీని చేశారు. ఇపుడు కూడా గవర్నర్ అదే పద్దతిలో వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ప్రభుత్వం పంపిన రెండుపేర్లపైనా ఏదన్నా అభ్యంతరాలుంటే అదే విషయాన్ని ఫైలుపై రాసి తిప్పి పంపవచ్చు.
గవర్నర్ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని కేసీయార్ అనుకుంటే సమాదానం రాసి పంపుతారు. లేకపోతే రెండుపేర్లను ఉపసంహరించుకుని మరో ఇద్దరి పేర్లను పంపుతారు. అయితే ఆ అవకాశం కేసీయార్ కు గవర్నర్ ఇవ్వటంలేదు. ఫైలును రెజెక్టు చేస్తే కేసీయార్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మరి రెజెక్టు చేయకుండా గవర్నర్ తన వద్దే అట్టిపెట్టేసుకున్నా లేకపోతే అభ్యంతరాలు, సందేహాలను లేవనెత్తి సమాధానం ఇవ్వమన్నా చేయగలిగిందేమీలేదు. మరి ఈ రెండుపేర్ల విషయంలో గవర్నర్ ఎలా రియాక్టవుతారో ఎవరికీ అర్ధంకావటంలేదు.