వారిపై కేసీఆర్ కు గట్టి ఆశలున్నాయి
రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటుబ్యాంకే గెలుపోటములను నిర్ణయిస్తుందనే ప్రచారం పెరిగిపోతోంది.
By: Tupaki Desk | 27 Aug 2023 5:52 AM GMTరాబోయే ఎన్నికల్లో బీసీల ఓటుబ్యాంకే గెలుపోటములను నిర్ణయిస్తుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే అన్నీపార్టీలు బీసీలకు పెద్దపీట వేయబోయేది తామే అంటు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నాయి. అయితే కేసీయార్ ఈమధ్యే ప్రకటించిన మొదటిజాబితాలో బీసీలకు అనుకున్నంత ప్రాధాన్యత ఇవ్వలేదు. 119 నియోజకవర్గాల్లో కేసీయార్ కేవలం 22 బీసీలకు మాత్రమే టికెట్లిచ్చారు. బీసీల సంఘాల లెక్కప్రకారం కనీసం మరో 15 సీట్లు తగ్గాయి. ఇచ్చిన టికెట్లు కూడా బీసీల్లోని యాదవ, గౌడ్, మున్నూరుకాపు, పద్మశాలి, గంగపుత్ర, వంజరి ఉపకులాల నేతలకు మాత్రమే ఇచ్చారు.
పై ఉపకులాలు కాకుండా ముదిరాజ్, ఆరెకటిక, కురబలు కూడా కీలకమైనవే. అయితే వీటిని కేసీయార్ అసలు లెక్కేచేయలేదు. అందుకనే కాంగ్రెస్ వీళ్ళకోసం సరికొత్త ప్లాన్ చేస్తోందట. కాంగ్రెస్ ఇవ్వబోయే టికెట్లలో ముదిరాజ్ లకు ఐదు టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీలను బీసీలకు కేటాయించాలన్నది అధిష్టానం నిర్ణయం. ఇందులో భాగంగానే యాదవ, గౌడ్, మున్నూరుకాపులు, గంగపుత్రులతో పాటు ముదిరాజ్, అరెకటిక, కురబలకు కూడా టికెట్లివ్వాలని కాంగ్రెస్ అనుకుంటున్నది.
రాష్ట్రం మొత్తంమీద ముదిరాజ్ లు సుమారు 45 లక్షలమంది జనాభా ఉన్నారట. అధిష్టానం చెప్పినట్లు కాకపోయినా కనీసం 30 నియోజకవర్గాలకు తగ్గకుండా బీసీలకు కేటాయించాలని పీసీసీ ఎన్నికల కమిటి ఇప్పటికే డిసైడ్ చేసింది. ముదిరాజ్, బెస్త, గంగపుత్ర సంఘాలు సెప్టెంబర్ 1వ తేదీన సమావేశమవబోతున్నాయి. తమ జనాభా ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది, తాము ఆశిస్తున్న నియోజకవర్గాలేవి అన్న విషయాన్ని ఆ సమావేశంలో ఫైనల్ చేసి ప్రకటించబోతున్నాయి. ఆ జాబితాను కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి అందివ్వాలని ఇప్పటికే సంఘాల నేతలు అనుకున్నారు.
మరోవైపు బీసీల జనాభా దామాషా చూసుకుంటే తమకు కనీసం 45 నియోజకవర్గాల్లో గెలుపోటమురలను నిర్ణయించే శక్తి ఉందని ఇప్పటికే కాంగ్రెస్ లోని బీసీ నేతలు ప్రకటించారు. కాబట్టి తమకు 45 సీట్లు కావాలని డిమాండ్ చేశారు. మొత్తంమీద బీసీల జనాభా, టికెట్ల కేటాయింపే రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు అర్ధమవుతోంది.