Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు తలనొప్పులు తెచ్చి పెడుతున్న కేటీఆర్ బ్యాచ్

కందకు లేని దురద కత్తిపీటకు ఎందున్న సామెతకు తగ్గట్లుగా పరిస్థితులు మారాయి.

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:48 AM GMT
కేసీఆర్ కు తలనొప్పులు తెచ్చి పెడుతున్న కేటీఆర్ బ్యాచ్
X

కందకు లేని దురద కత్తిపీటకు ఎందున్న సామెతకు తగ్గట్లుగా పరిస్థితులు మారాయి. తన వర్గ ప్రయోజనాల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ వర్గానికి నాయకత్వం వహించే వారు చూసుకోవాలి. తనను నమ్ముకున్న వారికి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో.. తమకు అండగా నిలిచే నాయకుడికి అనవసరమైన తలనొప్పులు తీసుకురాకూడదన్న జాగ్రత్త సదరు నేతను ఫాలో అయ్యే వారికి ఉండాలి. ఈ విషయంలో గులాబీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఊరికి ముందే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను డిసైడ్ చేసేసి.. ఎన్నికల ప్రచారానికి దిగిపోవాలంటూ గులాబీ బాస్ మార్గదర్శనం చేయటం వరకు బాగానే ఉన్నా.. కొత్త తలనొప్పులతో ఇప్పుడా పార్టీ కిందా మీదా పడుతోంది. సిట్టింగ్ లో వేళ్ల మీద లెక్క పెట్టే స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని మార్చిన కేసీఆర్.. సిట్టింగుల్లో 95 శాతం వరకు సీట్లను కట్టబెట్టేయటం తెలిసిందే. ఇప్పటికే రెండు దఫాలుగా టికెట్లు దక్కని నేతలకు ఈసారి టికెట్లు రాకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇప్పుడు మిస్ అయితే మరో ఐదేళ్ల వరకు అతీగతీ ఉండదని.. అప్పుడు పరిస్థితి ఏమిటో? అన్న ప్రశ్నతో పాటు.. ఈసారే ఎందుకు తమ కలను తీర్చుకోకూడదన్న పట్టుదల పెరుగుతోంది. దీంతో.. టికెట్ ఆశావాహుల పంచాయితీలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటివరకు వెలుగు చూసిన ఉదంతాల్ని చూస్తే.. వాటిల్లో ఎక్కువ కేటీఆర్ వర్గానికి చెందిన నేతల నుంచే కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మల్కాజిగిరి ఎపిసోడ్ లో మైనంపల్లి కావొచ్చు.. కుత్భుల్లాపూర్ విషయంలో శంభీపూర్ కావొచ్చు.. పటాన్ చెర్వుతో సహా పలు నియోజకవర్గాల్లో అసమ్మతి రాగం భారీగా వినిపించే చోట.. నిరసనల గొంతును పెంచేసి వినిపిస్తున్న వారంతా కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంటోన్మెంట్ లాంటి స్థానంలో కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే క్రిశాంక్ కు సైతం టికెట్ దక్కకపోవటంపై మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ పోస్టు చేసి అర్థం చేసుకోవాలంటూ అనునయించాల్సిన పరిస్థితి.

ఇలా పైకి మాట్లాడలేక.. అంతర్గతంగా బుజ్జగించే వారిలో పలువురు.. మంత్రి కేటీఆర్ మాటకు సరేనని చెప్పి.. కొద్ది రోజులు ఆగినంతనే తమ ప్రయత్నాలు తాము చేయటం గులాబీ పార్టీకి ఇప్పుడు కొత్త కష్టంగా మారింది. తన తండ్రి కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఏవైనా.. మధ్యలో అడ్డుకొని చర్చ జరిపి.. తాను అనుకున్న వారికి మాత్రం టికెట్లు ఇప్పించుకునే చొరవ మంత్రి కేటీఆర్ చేయరన్న విషయం పలువురికి తెలీదు. రాజకీయంగా తన తండ్రి తీసుకునే నిర్ణయాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి. ఆయన మాట మీదా.. నిర్ణయం మీదా కేటీఆర్ కు ఎంతో గురి. దీనికి తోడు తండ్రి కేసీఆర్ అంటే విపరీతమైన భయం భక్తి. ఇలాంటి వేళలో.. తండ్రి మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి కేటీఆర్ ది. అదే సమయంలో.. తనను నమ్మకున్న వారికి అనుగుణంగా టికెట్లు ఇప్పించలేని సంకట స్థితి.

ఇలాంటి సమయంలో మంత్రి కేటీఆర్ కాస్త సెటిల్డ్ గా ఉన్నప్పటికీ.. నేతలు పలువురు మాత్రంతమకు మంత్రి సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమకున్నఅసమ్మతిని తమ చేతలతో చూపిస్తున్నారు. దీంతో.. గులాబీ తోటలో ఇప్పుడు అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ధిక్కార స్వరాలకు చెక్ పెట్టకుంటే రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ సైతం తన వర్గీయులకు స్పీడ్ కు బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ విషయంలో ఏం తేడా జరిగినాపార్టీకే నష్టమన్నది నిజం. ఈ విషయాన్ని వదిలేసి.. తమ స్వార్థం కోసం చేసే ప్రయత్నాలను మంత్రి కేటీఆర్ ఖండించకుంటే ఇబ్బందులు తప్పవని చెప్పకతప్పదు. మరేం చేస్తారో చూడాలి.