ఒక్కటే దెబ్బకు కేసీఆర్ సర్కారు మాఫీ చేసిన రూ.20వేల కోట్ల లెక్క ఇదేనట
మాటలు ఘనం.. చేతల్లో శూన్యం అన్నట్లుగా కొందరు పాలకులు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కాస్తంత భిన్నం.
By: Tupaki Desk | 23 Sep 2023 4:12 AM GMTమాటలు ఘనం.. చేతల్లో శూన్యం అన్నట్లుగా కొందరు పాలకులు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కాస్తంత భిన్నం. మాటల్లోనే కాదు చేతల్లోనూ ఘనంగానే వ్యవహరిస్తారు. అదే నిజమైతే.. అంతకు మించి ఇంకేం కావాలన్న మాట కొందరి నోటి నుంచి రావొచ్చు. కానీ.. ఆయన చేతల్లో చూపించే ఘనం వెనుక లెక్కలు తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. తాజాగా అలాంటి వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రభుత్వ ఘనతను చెప్పుకుంటూ.. ‘ఒక్కటే దెబ్బకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశాం’ అని గొప్పగా చెప్పుకున్నారు.
ఏమైనా.. ఇలాంటివి చేస్తే కేసీఆరే చేయాలన్న మాట కొందరు గులాబీ నేతలు.. వారిని అభిమానించి.. ఆరాధించే వారి నోటి నుంచి రావొచ్చు. కానీ.. అసలు నిజం ఏమంటే.. ఒక్కటే దెబ్బకు రూ.20వేల కోట్లు మాఫీ చేయటానికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నది అసలు ప్రశ్న. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పటం తెలిసిందే.
మరి.. అప్పుడు చేయాల్సిన రుణమాఫీని ఇప్పుడు ఎందుకు చేసినట్లు? అంటే.. ఎన్నికలకు ముందు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో అంతా బాగుంది.. మొత్తంగా తెలంగాణ వెలిగిపోతుందన్న భావనను ప్రజలకు కలిగించేందుకేనని చెప్పక తప్పదు. ఇంతకూ ప్రభుత్వానికి రూ.20వేల కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. కాసులు కురిపించే బంగారు బాతు ఔటర్ రింగు రోడ్డును 30 ఏళ్లకు ఒక సంస్థకు ధారాదత్తం చేసినందుకు ప్రతిగా రూ.7380 కోట్లు వస్తే.. భారీ ఎత్తున భూముల విక్రయంతో రూ.12 వేల కోట్లు ఖజానాకు చేరాయి.
అలా చేరినంతనే ఆ భారీ మొత్తాన్ని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన రైతుల రుణమాఫీ పద్దుకు చేర్చేశారు. నిజానికి.. ఔటర్ రింగు రోడ్డు.. హైదరాబాద్ లోని భూముల్ని అమ్మగా వచ్చిన రూ.20వేల కోట్లు హెచ్ఎండీఏ ద్వారా ప్రభుత్వానికి సమకూరాయి. వాస్తవానికి.. ఈ డబ్బుల్లో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని హైదరాబాద్ మహానగరంలోని మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సిన అవసరం ఉంది.
మంత్రి కేటీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. రాష్ట్రాల ద్వారా కేంద్రానికి అందే ఆదాయంలో తిరిగి.. ఆయా రాష్ట్రాలకే అత్యధికంగా ఖర్చు చేయాలన్న మాట తరచూ చెబుతుంటారు. ఆ మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. హెచ్ ఎండీఏ భూముల వేలం ద్వారా వచ్చిన రూ.12 వేల కోట్లలో ఎంత మొత్తాన్ని హైదరాబాద్ మహానగరంలోని మౌలిక వసతుల కోసం ఖర్చుచేశారు? ఔటర్ రింగు రోడ్డును ముప్ఫై ఏళ్లకు ధారాదత్తం చేసిన కాంట్రాక్టులో వచ్చిన రూ.7380 కోట్లలో ఎంత మొత్తాన్ని ఔటర్ కు.. దాని చుట్టుపక్కల పెరుగుతున్న నగర డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేశారన్నది ప్రశ్న.
నిజానికి హెచ్ఎండీఏ ద్వారా ప్రభుత్వానికి సమకూరిన మొత్తాన్ని ఫ్లైఓవర్లు.. రోడ్లు.. స్కైవాక్ లాంటి మౌలిక వసతులకు ఖర్చుచేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా హెచ్ఎండీఏను కమీషన్ ఏజెంట్ గా మార్చేసి.. భూములు అమ్మకాల వేళ.. 2 శాతం కమిషన్ ఇస్తామంటున్న ప్రభుత్వ తీరు చూస్తే విస్మయానికి గురి కాక మానదు. సర్కారు ఖజానాను నింపేందుకు హెచ్ఎండీఏ సంస్థను ఏర్పాటు చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. హెచ్ఎండీఏ చట్టం 2008లోని సెక్షన్ 40 ప్రకారం హెచ్ఎండీఏ సొమ్ములను దాని పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించటానికే వినియోగించాలే తప్పించి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు వినియోగించటానికి వీల్లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో ఆ సంస్థ ద్వారా వచ్చిన రూ.20వేల కోట్ల (సుమారు) ఆదాయాన్ని రైతుల రుణ మాఫీ కోసం వెచ్చించటం దేనికి నిదర్శనం? అన్నది అసలు ప్రశ్న.