Begin typing your search above and press return to search.

కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో ఎంతటి చాణక్యుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   24 Sep 2023 9:58 AM GMT
కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే కేసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో ఎంతటి చాణక్యుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర సాధన ప్రయత్నం నుంచి, తెలంగాణ ఏర్పాటు, అనంత‌రం అభివృద్ధి- సంక్షేమంలో ఆయన ముందుకు సాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతలని తన వ్యూహాల‌తో తన రూట్లోకి తప్పించుకున్న కేసీఆర్ కి ఒక‌ సమస్య మాత్రం కొరివితో తలగోక్కుంటున్నట్టుగా మారుతుందని అంటున్నారు. అదే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అందులో ఎదురవుతున్న సవాళ్లు సమస్యలు.

నీళ్లు- నిధులు- నియామ‌కాలు అనే ట్యాగ్ లైన్ తో సాగిన తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అనంతరం గులాబీ దళపతిని ముఖ్యమంత్రిని చేసింది. అనంతరం ఆయన నీళ్లు నిధుల విషయాల్లో తన ఊహలకి పదును పెట్టి ఇటు రాజకీయంగా అట రాష్ట్రపరంగా ప్రయోజనాలు సాధించగలిగారు. అయితే కీలకమైన నియామకాల విషయంలో మాత్రం మొదటి నుంచి కేసీఆర్ బద్‌నాం అవుతున్నారని పరిణామాలను గమనించిన వారు చెప్తున్నారు. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం, ముఖ్యంగా యువత ఉద్యోగాల బ‌ర్తీలో మొదటి నుంచి కేసీఆర్ సర్కారు ప‌ట్ల అసంతృప్తితో ఉందన్న విషయం రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ఎవరైనా అంగీకరించాల్సిందే. అదే భర్తీ చేస్తున్న ఉద్యోగాల విష‌యంలోనూ మైలేజ్ పొందడం కంటే మచ్చ పడే విధంగానే పరిణామాలు జరుగుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ గ్రూప్ 1 మళ్ళీ మళ్ళీ రద్దవడం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు కావస్తుండ‌గా ఇప్పటి వ‌ర‌కు ఒకే ఒక్క గ్రూప్1 నోటిఫికేషన్ విడుదల చేయ‌గా, భ‌ర్తీ ప్ర‌క్రియ విజయవంతంగా ముందుకు సాగ‌డం లేదు. అనేక సవాళ్లు- సమస్యలు ఆందోళనలు ఈ గ్రూప్‌1 నోటిఫికేష‌న్ కేంద్రంగా సాగుతున్నాయి. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పరిణామం కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టుగా మారింది. పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించడంలో టీఎస్‌పీఎస్‌సీ అసమర్ధత ఎత్తిచూపుతూ హైకోర్టు ఈ నిర్ణ‌యం తీసుకుంది.

రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీఎస్‌పీఎస్‌సీ తీరును త‌ప్పుప‌డుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను హైకోర్టు ర‌ద్దు చేసింద‌ని బీఆర్ఎస్ పార్టీ అనుకూల వర్గాలు సమర్థించుకున్నప్పటికీ... ఇది ప్ర‌భుత్వ‌ వైఫల్యంగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే యువత ఖ‌చ్చితంగా భావిస్తోంది. ఈ మేరకు ఆందోళనలు కూడా చేస్తున్నారు, మీడియాకు ఎక్కుతున్నారు. ఓవైపు ఎన్నికల షెడ్యూల్ ఈ వార‌మా .. వ‌చ్చే వార‌మా అన్నట్టుగా ఉన్న తరుణంలో ఈ నోటిఫికేషన్ రద్దు పరీక్ష రద్దు కొరివితో తల గోక్కున్నట్టుగానే మారింద‌ని అంటున్నారు. ఈ సంక్లిష్ట స‌మ‌స్య‌ను గులాబీ దళపతి ఎలా పరిష్కరిస్తారో ఎదురు చూడాల్సిందే.