కొందరు అభ్యర్థులకు కేసీఆర్ షాక్?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి.
By: Tupaki Desk | 15 Oct 2023 6:53 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కొద్ది రోజుల క్రితమే 114 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందు ఉంది. ఇక, తాజాగా ఈ రోజు 55 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు తమ అభ్యర్థులకు బీ ఫారమ్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. అయితే, అనూహ్యంగా 114కు బదులు కేవలం 51 మందికే బీ ఫారాలు ఇవ్వబోతున్నామని ప్రకటించడంతో అభ్యర్థులు షాకయ్యారు.
దీంతో, కొందరు అభ్యర్థులను కేసీఆర్ మార్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ జాబితాను బట్టి కేసీఆర్ కొందరికి బీఫామ్ ఇవ్వకపోవచ్చని టాక్ వస్తోంది. కనీసం 5-10 మంది స్థానంలో కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అయితే, పైకి మాత్రం మిగతా బీ ఫామ్స్ సిద్ధం కాలేదని కేసీఆర్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు బీ ఫామ్ అందుకోని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 114 జాబితా ప్రకటించి 50 రోజులు అవుతోందని, ఇప్పటికీ బీ ఫామ్స్ సిద్ధం కాలేదనడంతో అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలపై నెగెటివ్ రిపోర్టుల వల్లే కేసీఆర్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది.
పైకి మాత్రం బీ ఫామ్స్ పేరుతో వారిని హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. అయితే, రేపు మిగతా అభ్యర్థులందరికీ బీఫామ్ లు అందజేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. టికెట్ దక్కని నేతలు తొందరపడవద్దని, ఆర్ఎస్ ను ఓడించలేక రాజకీయ ప్రత్యర్థులు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ఫామ్ లు జాగ్రత్తగా నింపాలని, అన్నీ తెలుసని అనుకోవద్దని అన్నారు. కోపతాపాలను పక్కన పెట్టి చిన్న కార్యకర్తను కూడా కలుపుపోవాలని అన్నారు. చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయవద్దని, ఎన్నికల ప్రచారంలో నోరు అదుపులోపెట్టుకోవాలని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.