అహంకారం ఉంటే జూపల్లిలా ఓడిపోతారు: కేసీఆర్
తెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 15 Oct 2023 6:54 PM GMTతెలంగాణ భవన్ లో పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముందు జరిగిన ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. నాయకులు, కార్యకర్తలతో సామరస్యపూర్వకంగా మెదలాలని, తలబిరుసుతనంతో ప్రవర్తిస్తే ఓటమి తప్పదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జూపల్లి ఓటమిని ఉదహరిస్తూ ఆయనపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారం ప్రదర్శించడం వల్లే గత ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారని కేసీఆర్ చెప్పారు.
మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు అహంకారంతో వ్యవహరించారని, ఇతర నాయకులను కలుపుకొని పోలేదని, వారితో సరిగా మాట్లాడలేదని అన్నారు. ఆ కారణంతోనే 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని కేసీఆర్ అన్నారు. 300 ఓట్లు తేగలిగిన ఓ నాయకుడితో జూపల్లి మాట్లాడకుండా అహంకారానికి పోయారని, అందుకే ఓడిపోయారని, ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నానని, ఎన్నికల వేళ అందరు నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోవాలని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని. ఐదారుగురు తప్ప సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇచ్చామని చెప్పారు. రెండు రోజుల్లో అభ్యర్థులందరికీ బీఫామ్ లు అందజేస్తామని అన్నారు. సామరస్యపూర్వకంగా సీట్లను సర్దుబాటు చేశామని, వేములవాడలో న్యాయపరమైన చిక్కుల కారణంగా అభ్యర్థిని మార్చామని అన్నారు. టికెట్ దక్కని నేతలు తొందరపడవద్దని , అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులదేనని కేసీఆర్ చెప్పారు.