Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట‌ల్లో.. మోడీ ఏమైండు?: నెటిజ‌న్ల క్వ‌శ్చ‌న్‌

అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుద‌ల‌పైనా కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో కామెంట్లు కుమ్మ‌రించారు

By:  Tupaki Desk   |   19 Oct 2023 8:40 AM GMT
కేసీఆర్ మాట‌ల్లో.. మోడీ ఏమైండు?:  నెటిజ‌న్ల క్వ‌శ్చ‌న్‌
X

తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ ఆరు మాసాల కింద‌కు వెళ్లి చూస్తే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఎక్క‌డ ప్రెస్ మీట్ నిర్వ‌హించినా.. టార్గెట్ కేంద్రం.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ. కేంద్రం మ‌న వ‌డ్లు కొన‌డంలేద‌ని, ఎఫ్ సీఐ అన్యాయం చేసింద‌ని, మ‌న ప‌రిశ్ర‌మ‌ల‌ను అమ్మేస్తున్నార‌ని, సింగ‌రేణిపైనా మోడీ క‌న్ను ప‌డింద‌ని.. మ‌న జ‌లాల్లో కొర్రీ పెట్టి.. తీర్చేటందుకు స‌మ‌యం లేద‌ని చెబుతున్న వాజ‌మ్మ‌! అని ఇలా.. ఆయ‌న త‌న‌దైన శైలిలో కేంద్రంపైనా, మోడీపైనా విరుచుకుప‌డ్డారు.

అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుద‌ల‌పైనా కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో కామెంట్లు కుమ్మ‌రించారు. బీజేపీని త‌రిమికొట్టేందుకే.. తాను బీఆర్ ఎస్ పార్టీ పెట్టాన‌ని కూడా చెప్పారు. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల సీజ‌న్‌. ప్ర‌జాశీర్వాద స‌భల పేరుతో కేసీఆర్ ప్ర‌చార సభ‌ల‌కు కూడా శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున గంట‌ల త‌ర‌బ‌డి ఆయ‌న ప్ర‌సంగాలు చేస్తున్నారు. అయితే.. ఎక్క‌డా కూడా బీజేపీ అన్న మాటే వినిపించ‌డం లేదు. క‌నీసం మోడీ గురించిన ఒక్క మాట కూడా చెప్ప‌డం లేదు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు మోడీ అంటే అంతెత్తున ఎగిరి ప‌డిన ఆర‌డుగుల కేసీఆర్‌.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే కాదు.. ఎక్క‌డ నోరు విప్పినా.. కాంగ్రెస్ గురించే మాట్లాడుతున్నారు. ఇంకా, గ‌త కాల‌పు సంగ‌తుల‌ను త‌వ్వి తీస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం.. కాంగ్రెస్ నేత‌ల వ్య‌వ‌హారం.. అంటూ.. ఇంకా పాత కాల‌పు విష‌యాల‌నే ప్ర‌చారంలో పెడుతున్నారు. కానీ, మోడీ గురించి ఒక్క మాట కూడా అన‌డం లేదు. ఇదే ఇప్పుడు నెటిజ‌న్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ గా మారింది.

వాస్త‌వానికి తెలంగాణ ఇచ్చిన త‌ర్వాత‌.. కాంగ్రెస్ కేంద్రంలో ఓడిపోయింది. గ‌త ప‌దేళ్లుగా ఇక్క‌డ కేసీఆర్‌, అక్క‌డ మోడీనే రాజ‌కీయాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను పాలిస్తున్నారు. అభివృద్ధి జ‌రిగినా.. జ‌ర‌గ‌క‌పోయినా.. వీరిదే బాధ్య‌త‌. సో.. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌లు అభివృద్ధి నినాదంతో జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకొంటున్న కేసీఆర్‌.. కేంద్రంపై ఒక్క‌వేలు కూడా చూపించ‌డం లేదు. కానీ, అధికారంలో లేని.. ప‌దేళ్లుగా సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్న కాంగ్రెస్ వైపు మాత్రం అన్ని వేళ్లూ చూపిస్తున్నారు.

ఒక్క కేసీఆర్ మాత్ర‌మే కాదు.. ఆయ‌న కుమారుడు, మంత్రి కేటీఆర్ కూడా.. కాంగ్రెస్‌పైనే విరుచుకుపడు తున్నారు. గత పదేళ్లలో గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. నిన్నైనా.. నేడైనా.. రేపైనా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా మండిపడ్డారు.

మ‌రి ప‌దేళ్లుగా కేంద్రం లో అధికారంలో ఉన్న మోడీ కూడా ఏమీచేయ‌లేద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పుకొచ్చిన కేసీఆర్‌, కేటీఆర్‌లు.. ఏమాత్రం అధికారంలో లేని కాంగ్రెస్‌ను ఇప్పుడు టార్గెట్ చేయ‌డం, బీజేపీ గురించి ప‌న్నెత్తు మాట కూడా అన‌క‌పోవ‌డం.. వంటివి అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఇదే విష‌యంపై నెటిజ‌న్లు సూటిగానే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. మ‌రి దీనికి బీఆర్ ఎస్ అధినేత ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.