Begin typing your search above and press return to search.

ఏపీకి తెలంగాణ సీఎం రాక‌.. రీజ‌నేంటి?

ఇప్పటికే దీనికి సంబంధించి జాతీయస్థాయి నాయకులను కూడా ఆమె ఆహ్వానించారు.

By:  Tupaki Desk   |   7 July 2024 5:42 PM GMT
ఏపీకి తెలంగాణ సీఎం రాక‌.. రీజ‌నేంటి?
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఏపీకి రానున్నారు. ఆయన రాకకు ప్రత్యేకంగా రాజకీయ పరమైనటువంటి కారణాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆయన ఏపీ పర్యటన మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునాదులను బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో షర్మిల ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి జాతీయస్థాయి నాయకులను కూడా ఆమె ఆహ్వానించారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖ‌ర్గే, డీకే శివకుమార్ సహా అనేకమంది జాతీయస్థాయి నాయకులను ఆమె ఆహ్వానించారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయిన తెలంగాణ ముఖ్యమంత్రి తో పాటు ఇతర నేతలను కూడా ఆమె పిలిచారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ సోమవారం ఏపీకి రానున్నారు. విజయవాడలో జరిగే వైయస్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

అయితే ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1.5 శాతం గా ఉన్న ఓటు బ్యాంకు 2.86 శాతానికి చేరుకోవడం కీలకంగా మారింది. పలు స్థానాల్లో గెలుస్తామని ముందుగా ఆశలు పెట్టుకున్నప్పటికీ పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేదు. కానీ కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడంలో సక్సెస్ అయ్యింది.

అదేవిధంగా ఓటు బ్యాంకును పెంచుకోవడంలో కూడా విజయం సాధించింది. పార్టీని మరింత బలోపేతం చేయాల‌నే లక్ష్యంతో షర్మిల వైయస్ జయంతి వేడుకలను రాజకీయ అస్త్రంగా మ‌లుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేస‌మ‌యంలో వైఎస్ వార‌స‌త్వ విష‌యాన్ని కూడా ఆమె ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. నిర్వ‌హిస్తున్న వైఎస్ జ‌యంతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.