"వీర గంధము తెచ్చినారము.." తెలంగాణ టాక్ బ్రో!
ఎవరు ఎక్కడికి వెళ్లినా..హారతులు, మేళాలు వినిపిస్తున్నాయి. మీరే మా నాయకుడు అంటే.. మీరే మా నేత అంటూ.. ప్రజలు టెంకాలు కొట్టేస్తున్నారు.. జేజేలు పలికేస్తున్నారు.
By: Tupaki Desk | 21 Nov 2023 2:45 AM GMT"వీర గంధము తెచ్చినారము.. వీరుడెవ్వడొ తెల్పుడీ!" అన్న రాయప్రోలు సుబ్బారావు వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో జోరుగా వినిపిస్తున్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్లినా..హారతులు, మేళాలు వినిపిస్తున్నాయి. మీరే మా నాయకుడు అంటే.. మీరే మా నేత అంటూ.. ప్రజలు టెంకాలు కొట్టేస్తున్నారు.. జేజేలు పలికేస్తున్నారు. ప్రతి దణ్ణాలు పెట్టేస్తున్నారు. దీంతో 'ఎన్నికల పోరులో వీరు డెవ్వడు?' అనే మాట వినిపిస్తుండడం గమనార్హం. 'ఎవరు ప్రజల వద్దకు వెళ్లినా.. మీరే మా నాయకుడు, మీకే మా ఓటు" అనే ధోరణి స్పష్టంగాకనిపిస్తోంది. దీంతో నేతలకు ప్రజానాడి అందడం లేదు.
అధికార పార్టీ నుంచి చోటా మోటా పార్టీల వరకు ఎవరు ప్రజల వద్దకు వెళ్లినా.. ఇదే తంతు! ఎక్కడా తేడా లేదు. ఎవరి విషయం లోనూ ప్రజలకు పక్షపాతం లేదు. సిట్టింగ్ నేతా.. బెట్టింగ్ నేతా.. చోటా నాయకుడా.. బడా నాయకుడా? అనే బేధం అసలేలేదు. ఎవరు వచ్చినా.. స్వాగత సత్కారాలకు తెలంగాణ సమాజం ముందుంటోంది. మీకే మావోటు అంటు.. గొంతెంత్తి తాండవిస్తోంది. దీంతో ప్రజల స్వాగత సత్కారాలకు నాయకులు పొంగిపోతున్నారు. తీరా సాయంత్రం వేళ సభలు సమావేశాలు ముగించుకుని శిబిరాలకు చేరుకున్నాక.. ప్రత్యర్థులకుకూడా ప్రజలు ఇలానే స్వాగత సత్కారాలు చేశారన్న విషయం తెలుసుకుని.. మథన పడిపోతున్నారు.
"అసలే టఫ్ పోటీ. ఎవరు ఏ పక్షమో కూడా తెలియడం లేదు" అని బీఆర్ ఎస్ నాయకులు వాపోతుంటే.. ఇదే తరహాలో కాంగ్రెస్ నేతలు కూడా తర్జన భర్జనకు గురవుతున్నారు. ఈ పరిస్తితి కేవలం ఈ రెండు పార్టీలకే పరిమితం కాలేదు. బీజేపీ నేతల నుంచి బీఎస్పీ నాయకుల వరకు స్వతంత్రుల నుంచి సిట్టింగుల వరకు అందరిదీ ఒకే వరస!! వీరగంధం ఎవరికి దక్కుతుందోన నే బెంగ. వీరులెవరో? ఎవరికిప్రజలు ఓటెత్తుతారోననే ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయినా.. ఆ ఛాయలు ముఖంపైకి రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారు. ఎవరిని పలకరించినా చిరునవ్వు పులుముకుంటు న్నారు. ప్రత్యర్థికి జేజేలు కొట్టకుండా చూసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే ఆవేదనను గొంతులోనే గరళం మాదిరి దాచేసుకుంటున్నారు. వెరసి.. వీరగంధం తెచ్చినారము.. అనే మాట ఇప్పుడు తెలంగాణలో జోరుగా వినిపించేలా చేస్తున్నారు.