కాంగ్రెస్ కి షర్మిల అవసరం లేదా...?
కాంగ్రెస్ అనేది ఒక మహా సముద్రం. అక్కడ నాయకులు ఎంత మంది ఉన్నా సీజన్ బట్టి ఒక్కొక్కరికి ప్రధాన్యత వస్తుంది
By: Tupaki Desk | 31 Aug 2023 8:02 AM GMTకాంగ్రెస్ అనేది ఒక మహా సముద్రం. అక్కడ నాయకులు ఎంత మంది ఉన్నా సీజన్ బట్టి ఒక్కొక్కరికి ప్రధాన్యత వస్తుంది. కాంగ్రెస్ సముద్రంలో ఈదుతూ నాయకుడిగా చలామణీ కావడం బహు కష్టం. అందుకే కాంగ్రెస్ నుంచి వేరు పడిన వారే త్వరగా ముఖ్యమంత్రులు అయ్యారు. వైఎస్సార్ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో ఉంటూ ఎట్టకేలకు ముప్పయ్యేళ్ల పోరాటం తరువాత సీఎం అయ్యారు.
ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ కి నాయకుల అవసరం ఉంది కానీ అది శతాధిక వృద్ధ పార్టీ ఆ బ్రాండ్ ఇమేజ్ తోనే కధ నడచిపోతూ ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ లో చేరేందుకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఉత్సాహపడుతున్నారు. నిజానికి షర్మిలను కాంగ్రెస్ పిలిచిందో లేక ఆమె ఆ వైపునకు రావాలనుకుంటున్నారో తెలియదు.
కర్నాటక ఎన్నికల ముందు తరువాత అన్నట్లుగా తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. ఈ ఎన్నికలకు ముందు అయితే ప్రతీ వారినీ కాంగ్రెస్ రావాలని కోరుకునేది. ఇపుడు అక్కడ అలాంటి సీన్ అయితే లేదు. కాంగ్రెస్ లోకి వెల్లువలా నాయకులు వస్తున్నారు. అధికార బీయారెస్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. అంతదాకా ఎందుకు టీడీపీలో మిగిలిన నాయకులు సీతా దయాకర్ రెడ్డి వంటి వారు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణాలో గెలుపు గుర్రం అని భావించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకే బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే వారు ఉంటారని ప్రచారం స్టార్ట్ అయింది. ఈ నేపధ్యంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్య నాయకులురాలు కావాలనుకుంటున్నారు.
మరి ఆమె కోరిక నెరవేరుతుందా అంటే ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలను బట్టి చూస్తే కొంత కష్టమే అని అంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ కి సరిపడా లీడర్ షిప్ ఉంది ఇంకా అవసరం అయిన చోట చాలా మంది బిగ్ షాట్స్ చేరేందుకు రెడీగా ఉన్నారు. దాంతో షర్మిలను చేర్చుకుని కాంగ్రెస్ తెలంగాణాలో ఆమె కోరుకున్న సీటుని ఇస్తుందా అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్.
ఇక ఆంధ్రామూలాలు ఉన్న షర్మిలను తెలంగాణా కాంగ్రెస్ లో కీలకం చేస్తే కేసీయార్ ప్రయోగించే తెలంగాణా సెంటిమెంట్ అస్త్రం తమకు ఇబ్బంది అవుతుంది అన్నది మరో బెంగగా ఉంది అని అంటున్నారు. ఇప్పటికే టీ కాంగ్రెస్ లో ముఖ్య వ్యక్తులు అంతా షర్మిలను చేర్చుకుంటే ఓకే కానీ ఆమెను ఏపీ రాజకీయాల్లోనే ఉపయోగైంచుకోవాలని హై కమాండ్ కి సూచిస్తున్నారు అని అంటున్నారు.
అయితే గురువారం ఉదయం ఢిల్లీలో సోనియాగాంధీని ఆమె నివాసంలో కలసిన తరువాత బయట మీడియాతో మాట్లాడిన షర్మిల మాత్రం తాను తెలంగాణా రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె అన్న మాటలు చూస్తే తెలంగాణా ప్రజల కోసం వారి మేలు కోసం ఏమి చేయాలో అదే చేస్తాను అని చెప్పారు. అంతే కాదు కేసీయార్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని అన్నారు
దీన్ని బట్టి చూస్తే షర్మిల తెలంగాణాలోనే పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు అని అర్ధం అవుతోంది. మరో వైపు చూస్తే ఆమె ఖమ్మం జిల్లా పాలేరు సీటుని ఆశిస్తున్నారు. దాన్ని మాజీ మంత్రి కాంగ్రెస్ లో త్వరలో చేరుతారని భావిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకు ఇస్తారని అంటున్నారు. షర్మిలకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం లో ఉంది. ఎంపీ ఎన్నికలు అంటే 2024లో మాట. అప్పటికి రాజకీయాలు ఎంత మారుతాయో ఎవరికీ తెలియదు. అందుకే రెండు మూడు నెలలలో వచ్చే తెలంగాణా ఎన్నికల్లోనే పోటీ చేయాలని షర్మిల కోరుకుంటున్నారు అని అంటున్నారు
ఇక షర్మిల తెలంగాణా రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషించడానికి ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీ కాంగ్రెస్ పెద్దల అనుమతి కూడా కావాల్సి ఉంది అని అంటున్నారు. ఈ విషయాలను చర్చించడానికి టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ పిలిపించి మాట్లాడుతారు అని అంటున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ కి అయితే షర్మిల అవసరం ఏపీలో మాత్రమే ఉంది అని అంటున్నారు. ఆ దిశగానే వారు ఆలోచిస్తూ ఆమె పార్టీని చేర్చుకోవాలని చూస్తున్నారు. మరో రెండు ఎన్నికలకు కానీ ఎత్తిగిల్లని ఏపీలో రాజకీయాలు చేయడం షర్మిలకు ఇష్టం లేదు అని అంటున్నారు.
పైగా అన్న అక్కడ అధికారంలో ఉన్నారు. వైసీపీకి యాంటీగా రాజకీయం చేస్తే లబ్ది టీడీపీకే తప్ప ఎవరికీ రాదు, అందుకే షర్మిల టీ కాంగ్రెస్ లోనే తన రాజకీయం అంటున్నారు. కాంగ్రెస్ కనుక ఆమెను తెలంగాణా రాజకీయాల్లో వాడుకుంటామని హామీ ఇస్తే ఈ విలీనం ఉంటుంది అని అంటున్నారు. లేకపోయినా షర్మిల పార్టీలో చేరాలనుకుంటే మాత్రం అది ఆమెకు చివరి అప్షన్ మాత్రమే అవుతుంది అని అంటున్నారు.