Begin typing your search above and press return to search.

రాజకీయాలకు దూరమైనట్లేనా ?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లు రాజకీయాలకు దూరమైపోయారా ? ఇదే అనుమానం అందరిలోను పెరిగిపోతోంది

By:  Tupaki Desk   |   31 Aug 2023 8:04 AM GMT
రాజకీయాలకు దూరమైనట్లేనా ?
X

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లు రాజకీయాలకు దూరమైపోయారా ? ఇదే అనుమానం అందరిలోను పెరిగిపోతోంది. ఇందుకు కారణం ఏమిటంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి దరఖాస్తులు చేయలేదు. దరఖాస్తులు చేయలేదు కాబట్టే వీళ్ళు రిటైర్ అయినట్లే అనే ప్రచారం పార్టీలో ఊపందుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో పోటీచేయటానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడే దరఖాస్తు చేసుకున్న తర్వాత మరి వీళ్ళెందుకు దరఖాస్తులు చేసుకోలేదనే ప్రశ్న చక్కర్లు కొడుతోంది.

సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీమంత్రి గీతారెడ్డి, వీ హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, సీనియర్ నేత జీ నిరంజన్ తదితరులు దరఖాస్తులు చేసుకోలేదు. దరఖాస్తులు చేసుకోకపోవటమే కాకుండా గాంధీభవన్ కు కూడా పెద్దగా రావటంలేదు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా తగ్గిపోయింది. సో ఈ కారణాలన్నింటినీ చూసినపుడు వీళ్ళు రాజకీయాల నుండి రిటైర్ అయినట్లే అనుకుంటున్నారు. రేణుకాచౌదరి కూడా దరఖాస్తు చేసుకోలేదు.

అయితే ఆమె బాగా యాక్టివ్ గానే ఉంటున్నారు. అంతేకాకుండా ఆమె దృష్ణంతా ఎప్పుడూ పార్లమెంటు ఎన్నికల పైనే ఉంటుంది. కాబట్టి ఇపుడు దరఖాస్తు చేసుకోలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. జానారెడ్డి కొడుకు జై వీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నా మిగిలిన నేతల వారసులు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా ఎక్కడా వినబడటంలేదు. దానికితోడు వీళ్ళ వయసు కూడా 70 దాటేసింది.

నిజానికి ఇలాంటి సీనియర్లు ఇంకా చాలామంది రాజకీయాల నుండి రిటైర్ అయిపోవాలని ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ లోని యువ నేతలు పదేపదే కోరుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలైనా సీనియర్ల హోదాలో వీళ్ళకే టికెట్లిస్తుంటే ఇక తాము ఎదిగేదెప్పుడని యువ నేతలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తమకు ప్రాధాన్యతిచ్చి టికెట్లు ఇవ్వాల్సిందే అని చాలామంది యువనేతలు డిమాండ్లు చేస్తున్నారు. మరి వీరి డిమాండ్లను అధిష్టానం ఎంతవరకు పట్టించుకుంటుంది ? ఎంతమందికి పోటీచేయటానికి అవకాశం ఇస్తుందన్నది సస్పెన్సుగా మారింది.