పెరికలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోందా ?
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో సామాజికవర్గాల ప్రభావం తీవ్రంగానే పడేట్లుంది. ముఖ్యంగా బీసీ వర్గాల నుండి దీని ప్రభావం ఎక్కువగా ఉండేట్లుంది
By: Tupaki Desk | 15 Sep 2023 3:30 PM GMTరాబోయే తెలంగాణా ఎన్నికల్లో సామాజికవర్గాల ప్రభావం తీవ్రంగానే పడేట్లుంది. ముఖ్యంగా బీసీ వర్గాల నుండి దీని ప్రభావం ఎక్కువగా ఉండేట్లుంది. బీసీల్లో కూడా యాదవులు, గౌడ్లు, పద్మశాలీలతో పాటు మరో రెండు ఉపకులాలకే కేసీయార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీదే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందులో కూడా ముఖ్యంగా పెరిక సామాజికవర్గం కీలక పాత్ర పోషించబోతోంది. కేసీయార్ ప్రకటించిన టికెట్లలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా పెరికల నుండి పోటీలో లేరు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 నియోజకవర్గాల్లో పెరికల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. పెరికల సంఘం నేతలు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో మాట్లాడుతు నాలుగు అసెంబ్లీ సీట్లను అడిగారు. మిర్యాలగూడ, పరకాల, వరంగల్ తూర్పు, మంచిర్యాల నియోజకవర్గాల్లో తాము కచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చారు. 50 నియోజకవర్గాల్లో సగటున పెరికల జనాభా 15 వేలుంది. కాబట్టి గెలుపోటములను నిర్ణయించే స్ధితిలోనే ఉన్నట్లు అనుకోవాలి.
పెరికల సంఘం నేతలు అడిగినట్లు నాలుగు అసెంబ్టీ సీట్లను కేటాయిస్తే మరి 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు లాభం జరుగుతుందా అన్నదే అర్ధంకావటంలేదు. ఇపుడు రాజకీయమంతా ఎలాగుందంటే ఎదుటివాళ్ళ మైనస్సే తమకు ప్లస్సన్నట్లుగా సాగుతోంది. కాబట్టి బీఆర్ఎస్ తరపున ఒక్కళ్ళకి కూడా పోటీచేసే అవకాశం ఇవ్వలేదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే కాంగ్రెస్ కు ఏమేరకు లాభం జరుగుతుందనే విషయమై పరిశీలన మొదలైంది.
కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న పెరిక నేతలతో సీనియర్లు మంతనాలు జరుపుతున్నారు. పార్టీ తరపున మిర్యాలగూడకు చెందిన వికలాంగుల విభాగం రాష్ట్ర ఛైర్మన్ ముత్తినేని వీరయ్యకు టికెట్ ఖాయమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కోచింగ్ సెటర్ పెట్టుకుని వేలాదిమంది విద్యార్ధులకు వివిధ ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నారు. అలాగే యేంబడి రవీందర్, ముత్తే సత్తయ్య, బుద్దె పెద్దన్న పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ పెరికలకు ఎన్ని టికెట్లు ఇస్తుంది ? పెరికలు కాంగ్రెస్ ను ఎన్ని నియోజకవర్గాలో గెలిపిస్తారో చూడాలి.