తెలంగాణ కాంగ్రెస్ సర్కారు.. నా కల: సోనియాగాంధీ.. కీలక పథకాల ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలనేది తన కలగా ఆమె పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు
By: Tupaki Desk | 18 Sep 2023 5:56 AM GMTహైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు ఆదివారం సాయంత్రం నిర్వహించిన జయభేరి బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, అగ్రనేత సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలనేది తన కలగా ఆమె పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ''తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలి'' అని సోనియా పిలుపునిచ్చారు.
సోనియా ప్రసంగం సాగుతున్న సమయంలో సభకు వచ్చిన ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించిన సోనియా.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తన సహచరులు సహా తాను కూడా తెలంగాణ ఆవిర్భావం కోసం కృషి చేశామన్నారు. ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
''తెలంగాణకు ఈ రోజు(సెప్టెంబరు 17) చారిత్రక దినోత్సవం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. నేను ప్రకటించిన ఆరు గ్యారెంటీలు.. రాష్ట్ర సోదరీమణుల సాధికారతకు ఎంతగానో దోహదపడతాయి'' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోనియా.. ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చినట్టుగానే సోనియా తెలంగాణ ప్రజల కలలను సాకారం చేశారని తెలిపారు.
కొందరు ఏమీ చేయకుండానే ఏదో చేసినట్టు చెప్పుకొంటున్నారని ఖర్గే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉందని, కానీ, ఇప్పుడు 3.66 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. బీఆర్ ఎస్ పార్టీ బీజేపీకి బీ-టీం అని విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నట్టుగానే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం భూములను అమ్మేస్తోందని ఖర్గే పేర్కొన్నారు. తప్పుడు వాగ్దానాలతో అటు మోడీ, ఇటు కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ గ్యారెంటీలు ఇవీ..
+ ప్రతి మహిళకూ రూ.2500 చొప్పున ఆర్థిక సాయం
+ మహిళలకు టీఎస్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి ఉచిత ప్రయాణం
+ వంట గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇవ్వడం
+ రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15000 చొప్పున ఆర్థిక సాయం, వ్యవసాయ కార్మికకులకు రూ.12000 ఆర్థిక సాయం. క్వింటా ధాన్యం ఉత్పత్తికి రూ.500 బోనస్(ఎంఎస్‌పీకి)
+ 5 లక్షల మంది ఇళ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
+ తెలంగాణ ఉద్యమ కారుల కుటుంబాలకు 250 గజాల స్థలాల పంపిణీ
+ గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
+ యువవికాసం పథకం కింద విద్యా భరోసా కార్డులు.. ప్రతి విద్యార్థికీ రూ.5 లక్షల సాయం
+ అన్ని మండలాల్లోనూ అంతర్జాతీయ స్థాయి పాఠశాలల నిర్మాణం
+ చేయూత పథకం కింద సీనియర్ సిటిజన్లకు నెలనెలా రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా.