టికెట్లు కాదు.. సముచిత స్థానమే!
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడందరి చూపు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పైనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
By: Tupaki Desk | 19 Oct 2023 8:48 AM GMTతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడందరి చూపు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పైనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా తలపడే ఆస్కారముంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో టికెట్ రాని, ప్రాధాన్యం దక్కని నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ అసంత్రుప్త నాయకులందరికీ ఇప్పుడు కాంగ్రెస్ గూడుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇలా వచ్చిన వాళ్లందరికీ కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే లేదనే చెప్పాలి. అందుకే పార్టీ గెలిచిన తర్వాత సముచిత స్థానం ఇస్తామంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
తెలంగాణలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 119. వీటిల్లో పోటీ కోసం కాంగ్రెస్ లో వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే టికెట్ల కోసం ఈ పార్టీలో విపరీతమైన పోటీ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన కీలక నేతలు, వచ్చే ఎన్నికల్లో గెలిచేలా కనిపిస్తున్న నాయకులకు కాంగ్రెస్ టికెట్లు ఇస్తోంది. దీంతో హస్తం పార్టీలో అసంత్రుప్తి మరో స్థాయికి చేరుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చే అందరికీ కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం అసాధ్యం. అందుకే పార్టీలోకి వచ్చిన కొంతమంది కొత్త నాయకులు నిరాశ చెందకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఆయా నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. టికెట్లు దక్కని వాళ్లలో కొంతమందికి నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యతలు అప్పజెబుతున్నారు.
తాజాగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరారు. కానీ ఇప్పటికే మేడ్చల్ లో వజ్రేశ్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కీలక నేత సుధీర్ రెడ్డికి తగిన గౌరవం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుధీర్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడేమో మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ ఎన్నికల బాధ్యతలను సుధీర్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. మరోవైపు టికెట్ ఆశించిన హరివర్ధన్ రెడ్డి, నక్కా ప్రభాకర్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామమని రేవంత్ హామీనిచ్చారు. టికెట్ల దక్కని, రావని తెలిసిన నేతలను ఇలా బుజ్జగిస్తూ రేవంత్ సాగుతున్నారనే చెప్పాలి.