కాంగ్రెస్ కు మావోయిస్టుల మద్దతా ?
తెలంగాణాలో ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులకు పెద్ద సమస్య మొదలవుతుంది. అదేమిటంటే మావోయిస్టుల బెదడ
By: Tupaki Desk | 24 Oct 2023 5:57 AM GMTతెలంగాణాలో ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులకు పెద్ద సమస్య మొదలవుతుంది. అదేమిటంటే మావోయిస్టుల బెదడ. ఎన్నికలు స్ధానిక సంస్ధలకు అయినా సరే సార్వత్రిక ఎన్నికలయినా సరే మావోయిస్టులు రెచ్చిపోతుంటారు. అదే పద్దతిలో ఇపుడు కూడా మావోయిస్టులు రంగంలోకి దిగేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బహిష్కరించాలని, పై రెండుపార్టీలకు ఓట్లు వేయద్దని ప్రజలకు పిలుపిచ్చారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు ఒక లేఖను విడుదలచేశారు.
తన లేఖలో జగన్ ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేశారు కాని కాంగ్రెస్ గురించి కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అంటే పరోక్షంగా మావోయిస్టులు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారా అనే చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉంది. ఇదివరకంతా బలంగా మావోయిస్టులు పై జిల్లాల్లో లేనప్పటికీ ఇంకా ఉనికిలో అయితే ఉన్నారని చెప్పకతప్పదు.
మావోయిస్టుల ప్రభావం కారణంగానే కొన్నిప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు స్వేచ్చగా తిరగలేకపోతున్నారు. అలాంటిది సరిగ్గా ఎన్నికల సమయంలో బహిష్కరణకు లేదా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులను వ్యతిరేకించాలని మావోయిస్టుల పిలుపంటే పై పార్టీల అభ్యర్దులకు కాస్త ఇబ్బందనే చెప్పాలి. మావోయిస్టుల పిలుపు జనాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే అభ్యర్ధుల్లో టెన్షన్ పెంచేయటం అయితే ఖాయం. ప్రచారంలో మారుమూల గ్రామాలకు వెళ్ళాలంటేనే అభ్యర్ధులు భయపడే పరిస్ధితిలో ఉంటారు. ఇలాంటపుడు ప్రచారం సంపూర్ణంగా చేసుకోవటం సాధ్యంకాదు. ప్రచారాన్ని పూర్తిగా చేసుకోలేని అభ్యర్ధులు ఇక పోలింగ్ విషయంలో ఏమి దృష్టిపెట్టగలరు ? కాంగ్రెస్ అభ్యర్ధులు మాత్రం స్వేచ్చగా ప్రచారం చేసుకునేందుకు వీలుంటుందా అని ఆలోచిస్తున్నారు.
సరిగ్గా ఈ పాయింట్ మీదే మావోయిస్టుల వైఖరి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పై రెండుపార్టీలను జనాలు తన్ని తరిమేయాలని జగన్ పిలుపిచ్చారు. మిగిలిన పార్టీలను ప్రజాకోర్టులో నిలదీయాలని మాత్రమే చెప్పారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అని ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదు. బీఆర్ఎస్ కు దానికి మద్దతిస్తున్న బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని అధికార ప్రతినిధి హెచ్చరించారు. మావోయిస్టులు పిలుపైతే ఇచ్చేశారు మరి దాని ప్రభావం ఎన్నికల్లో ఎలాగుంటుందో చూడాలి.