Begin typing your search above and press return to search.

రేవంత్ సీఎం.. నేను మంత్రి.. కోండా సురేఖ జోస్యం!

ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే ప్రభుత్వం, అందులో ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల వివరాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారు కొండా సురేఖ

By:  Tupaki Desk   |   26 Oct 2023 12:04 PM GMT
రేవంత్ సీఎం.. నేను మంత్రి.. కోండా సురేఖ జోస్యం!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇంటింటికీ వస్తున్న రాజకీయ అతిధులు, వారిస్తున్న వాగ్ధానాలు, చూపిస్తున్న స్వర్గాలు, చేస్తున్న ప్రమాణాలతో సామాన్య ప్రజానికం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు! ఈ విషయంలో అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ లు పోటాపోటీగా ముందుకు పోతున్నాయని చెబుతున్నారు. బీజేపీ కూడా పరుగు లంకించుకుందని అంటున్నారు. ఈ సమయంలో కొండా సురేఖ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

అవును... కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఆ గెలుపును కంటిన్యూ చేయాలని, అందులో భాగంగా తెలంగాణలో జెండా పాతాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించిన కాంగ్రెస్... ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్షను కంటిన్యూ చేస్తుంది. త్వరలో తుదివిడత జాబితాను ఫైనల్ చేయనుందని అంటున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే ప్రభుత్వం, అందులో ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల వివరాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారు కొండా సురేఖ. వరంగల్ తూర్పు నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖ.. రంగశాయిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర కామెంట్లు చేశారు. దీంతో... ఇప్పుడు ఈమె చేసిన కామెంట్లు పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయని అంటున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన కొండా సురేఖ... తెలంగాణతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ లో త్వరలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. టీపీసీసీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని.. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో, మరిముఖ్యంగా సీనియర్స్ మధ్య తీవ్ర చర్చకు తెరతీశాయని అంటున్నారు.

కాంగ్రెస్‌ లో సీఎం అభ్యర్థిని హైకమాండ్ డిసైడ్ చేస్తుందని పార్టీ నేతలు ఒకపక్క చెబుతుండగా.. కొండా సురేఖ మాత్రం రేవంత్ రెడ్డే సీఎం అని, తాను మంత్రి అని ప్రకటించుకోవటం ఏమిటని గుస్సా అవుతున్నారని అంటున్నారు. అయితే... ఇది రేవంత్ ఆడుతున్న మైండ్ గేం లో భాగంగానే కొండా సురేఖ అలా వ్యాఖ్యానించారని మరికొంతమంది కామెంట్ చేస్తుండటం గమనార్హం!

ఇక బీజేపీ, బీఆరెస్స్ లను ఒకేగాటికి కట్టేసిన కొండా సురేఖ... రెండు పార్టీలపైనా విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... చీకటి ఒప్పందం కారణంగానే లిక్కర్ కేసులో కవితకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించిందని ఆరోపించారు. ఇదే క్రమంలో... ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పిన సురేఖ... అందులో ఏపార్టీకి ఓటేసినా మరోసారి అవినీతి పాలన ఖాయమని తెలిపారు!

కాగా... 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ ప్రకటించిన తొలిజాబితాలో కొండా సురేఖకు పేరు లేని సంగతి తెలిసిందే. అయినప్పటికీ వరంగల్‌ ఈస్ట్‌ స్థానం అభ్యర్థిగా కొండా సురేఖ.. స్థానిక ప్రజలతో మమేకమై ఎన్నిక‌ల ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి సీఎం, తాను మంత్రి వంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి అటు పార్టీలోనూ, ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి.