లలిత-రవీందర్‌ల సెగ.. కాంగ్రెస్‌కు మామూలుగా లేదుగా!
దీంతో నిజామాబాద్‌లో గెలుపు గుర్రం ఎక్కే కొన్ని సీట్లలోనూ కాంగ్రెస్ ఇప్పుడు బలహీనపడిన పరిస్థితి కనిపిస్తోంది.
By: Tupaki Desk | 1 Nov 2023 4:30 PM GMTఒకరు మాజీ కాంగ్రెస్ నాయకురాలు.. మరొకరు బీజేపీ మాజీ నేత. ఈ ఇద్దరినీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు కొత్త ఊపు వస్తుందని ఆశించిన నిజామాబాద్ నాయకత్వానికి ఇప్పుడు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. అంతేకాదు.. వీరిద్దరి కారణంగా..పార్టీలో అసంతృప్తులు పెరిగిపోయాయి. అసలు వారిద్దరినీ ఎందుకు చేర్చుకున్నారనే వాదనను కొందరు నేతలు తెరమీదికి తెస్తున్నారు. ఇక, ఆకుల లలితకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కీలక నేతలు.. సెగలు పొగలు కక్కుతున్నారు. దీంతో నిజామాబాద్‌లో గెలుపు గుర్రం ఎక్కే కొన్ని సీట్లలోనూ కాంగ్రెస్ ఇప్పుడు బలహీనపడిన పరిస్థితి కనిపిస్తోంది.
ఏం జరిగింది?
రాజకీయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు బలమైన జిల్లా నిజామాబాద్. ఇక్కడ ఇద్దరు కీలక నేతలు బీఆర్ ఎస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏనుగు రవీందర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్దిరోజులు క్రితం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వారు సరేనని పార్టీలోకి జంప్ చేశారు.
ఇక, ఇక్కడి నుంచి అసలు రాజకీయం మొదలైంది. లలిత వాస్తవానికి మాజీ కాంగ్రెస్ నాయకురాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున లలిత ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. తిరిగి ఈ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్‌లోకి ఆకుల లలిత రీ ఎంట్రీ ఇచ్చారు. ఎల్లారెడ్డి టికెట్ ఆశిస్తూ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏనుగు రవీందర్ రెడ్డి చేరారు. కాగా ఈ ఇద్దరి నేతలపై స్థానిక నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలు తిరిగి పార్టీలో చేరడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేతలు మాకొద్దు.. అంటూ కాంగ్రెస్‌లో అసంతృప్త నేతలు వీరిపై నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ ఎస్‌లో ఉన్నప్పుడు లలిత తమపై కేసులు పెట్టించారని.. చులకనగా చూశారని క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్నారు. ఆమెకు సహకరించేది లేదని అంటున్నారు. ఇక, ఏనుగు రవీందర్‌తోనూ కాంగ్రెస్ నేతలు.. అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మొత్తంగా కొత్త నేతలతో కాంగ్రెస్‌లో సెగ పొగలు కక్కుతుండడం గమనార్హం. మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.