దిద్దుకోలేని తప్పు చేస్తున్న రేవంత్ అండ్ కో.. సరిదిద్దేవారెవరు?
ఎవరిని అడిగినా.. కాంగ్రెస్ గాలి ఉందన్న మాట వినిపిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో కచ్ఛితంగా గెలుస్తారన్న భరోసా కాంగ్రెస్ పార్టీ నేతలకే లేదన్న మాట వినిపిస్తోంది
By: Tupaki Desk | 16 Nov 2023 4:16 AM GMTఅందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. మిగిలిన రంగాల సంగతిని పక్కన పెడితే .. రాజకీయ రంగంలో ఇలాంటివి చోటు చేసుకోవటం చూసినప్పుడు.. ఇదేం తెలివితక్కువ పని అనుకోకుండా ఉండలేం. పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజల్లో ఒకలాంటి వ్యతిరేకత రావటం.. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందన్న వాతావరణం ఏర్పడటం తెలిసిందే. నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ గాలి ఉందా? లేదా? అన్నది పెద్ద ప్రశ్న.
ఎవరిని అడిగినా.. కాంగ్రెస్ గాలి ఉందన్న మాట వినిపిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో కచ్ఛితంగా గెలుస్తారన్న భరోసా కాంగ్రెస్ పార్టీ నేతలకే లేదన్న మాట వినిపిస్తోంది. క్రికెట్ ఆటలో ఆఖరి బంతి వరకు గెలుపు కోసం ప్రయత్నించాలే కానీ.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. అదే జరిగితే.. చేతికి వచ్చిన మ్యాచ్ సైతం చేజారిపోతుంది. ఇప్పుడు అలాంటి తీరునే తెలంగాణ కాంగ్రెస్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ లాంటి మరమేధావులు చాలా తక్కువగా కనిపిస్తారు. తనకు పది శాతం గెలుపు అవకావం ఉంటే.. దాన్ని డెబ్బై శాతానికి మార్చుకోవటానికి ఆయన ఎంతవరకైనా వెళతారు. ఎలాంటి పద్దతినైనా ఫాలో అవుతారు. అలాంటి రాజకీయ అధినేత బరిలో ఉన్నప్పుడు ఆయనతో పోటీ పడేవారు.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎంత కేర్ ఫుల్ గా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న మౌత్ టాక్ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న వేళ.. రేవంత్ అండ్ కో ఒకలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం సైతం తాము పోటీ పడుతోంది కేసీఆర్ అన్న విషయాన్ని మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న మాటను సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. తాను అధికారంలో ఉన్నప్పుడు కఠినంగా వ్యవహరించిన మీడియా సంస్థల విషయంలో ఇప్పుడు సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు.
వారికి.. జాకెట్ యాడ్స్ ఇచ్చేందుకు ససేమిరా అన్నట్లుగా వ్యవహరించిన గులాబీ బాస్.. ఈ రోజు వారికి రోజు మార్చి రోజు జాకెట్ యాడ్స్ ఇచ్చేయటం మొదలు మిగిలిన అన్ని విషయాల్లోనూ కాస్తంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం ఉందన్న మాటతో వచ్చిన మార్పు మాత్రమే. తనకు ఎదురుగాలి వీస్తుందన్న విషయం అర్థమైన వేళ.. ప్రత్యర్థితో రాజీ చేసుకొని బుట్టలో వేసుకొని.. తెలివిగా శత్రువు అన్నోళ్లే లేకుండా చేసే టాలెంట్ కేసీఆర్ సొంతం.
ఆ విషయాల్ని కాంగ్రెస్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. మొదట అనుకున్నంత ఖర్చును కూడా పెట్టకుండా ఉండటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. దీని పుణ్యమా అని.. గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని రాజకీయ వాతావరణంలో మార్పు వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్ని ఒక్కొక్కటిగా తన అధీనంలోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ మొదలెట్టిన మంత్రాంగం కీలక దశకు వచ్చిందని.. దాని ఫలితమే తాజా సానుకూలతగా చెబుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ అండ్ కో కళ్లు తెరవకపోతే.. చేతికి అందిన లడ్డూ లాంటి అవకాశం చేజారిపోవటం ఖాయమంటున్నారు. మరి.. ఈ నిజాన్నిరేవంత్ అండ్ కో తక్షణమే గుర్తిస్తారా? అన్నదే అసలు ప్రశ్న.