గ్రేటర్ లోనూ కాంగ్రెస్ గాలి? నిఘా రిపోర్టు చెప్పేది ఇదేనా?
అవునో కాదో తెలీదు కానీ.. తెలంగాణలోని ఏ ఇద్దరిని కదిలించినా.. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది
By: Tupaki Desk | 21 Nov 2023 2:30 PM GMTఅవునో కాదో తెలీదు కానీ.. తెలంగాణలోని ఏ ఇద్దరిని కదిలించినా.. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. సామాన్యుల మాటల్ని పట్టించుకోవద్దనుకున్నా.. ప్రతిపక్షాల వాదనల్ని వినొద్దనుకున్నా.. గులాబీ నేతలు సైతం కాంగ్రెస్ గాలి మాట విషయంలో ఖండించకుండా.. తాము కూడా వింటున్నామన్న మాట వింటేనే విషయం అర్థమవుతుంది. తెలంగాణలోని జిల్లాల సంగతి ఎలా ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ లోనూ.. అందునా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలన్ని గులాబీ గూటికే చేరుతాయన్న వాదన మొదట్నించి వినిపిస్తున్నదే.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 23 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. హైదరాబాద్ జిల్లా వరకే లెక్కలోకి తీసుకుంటే 15 నియోజకవర్గాలే వస్తాయి. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలు (రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, కుకట్ పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్.. మల్కాజిగిరి, ఎల్ బీ నగర్, మహేశ్వరం) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కిందకు రావటం తెలిసిందే. ఈ ఎనిమిది మినహాయిస్తే.. మిగిలిన 15 నియోజకవర్గాల విషయానికి వస్తే..
1. జూబ్లీహిల్స్
2.ఖైరతాబాద్
3. సనత్ నగర్
4. సికింద్రాబాద్
5. కంటోన్మెంట్
6. ముషీరాబాద్
7. అంబర్ పేట
8. గోషామహాల్
9. నాంపల్లి
10. చార్మినార్
11. చాంద్రాయణగుట్ట
12. యాకత్ పుర
13. బహుదూర్ పుర
14. మలక్ పేట
15. కార్వాన్
ఇందులో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే ఏడు నియోజకవర్గాల్లో మొదటిసారి నాంపల్లి స్థానాన్ని చేజార్చుకోనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గెలుపు ఖాయమన్న మాట వినిపిస్తోంది. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి పలు దఫాలు ఇదే సీటు నుంచి పోటీ చేస్తూ.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేయటంతో పాటు.. మజ్లిస్ కు వ్యతిరేకంగా మాటల కత్తి దూస్తున్న ఫిరోజ్ ఖాన్ ఈసారి ఎన్నికల్లో చరిత్రను క్రియేట్ చేయనున్నట్లుగా చెబుతున్నారు. మజ్లిస్ అధిపత్యాన్ని తొలిసారి బ్రేక్ చేసే అవకాశం ఫిరోజ్ ఖాన్ కు ఉందంటున్నారు. అదే జరిగితే.. అదో పెను సంచలనంగా మారుతుందని చెప్పాలి.
అంటే.. మొత్తం 15 స్థానాల్లో మజ్లిస్ కు దక్కాల్సిన ఏడుకు బదులుగా ఆరు స్థానాలు మాత్రమే వస్తాయన్న అంచనా నిఘా నివేదిక స్పష్టం చేస్తుందనిచెబుతున్నారు. మిగిలిన తొమ్మిదిలో నాంపల్లి కాంగ్రెస్ ఖాతాలోవేయగా.. జూబ్లీహిల్స్.. ఖైరతాబాద్.. ముషీరాబాద్ సీట్లను కాంగ్రెస్ ను గెలుచుకునే వీలుందంటున్నారు. అదే సమయంలో సికింద్రాబాద్.. సనత్ నగర్.. అంబర్ పేటల్లో మాత్రమే గులాబీ కారు దూసుకెళుతుందనన మాట వినిపిస్తోంది. మిగిలిన రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు సిటీలో గోషామహల్ లో మాత్రమే బీజేపీ తన సత్తా చాటుతున్న వేళ.. ఈసారి దానికి అదనంగా కంటోన్మెంట్ కూడా బీజేపీ ఖాతాలో పడుతుందని చెబుతున్నారు.
అంటే.. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 15 స్థానాల్లో మజ్లిస్ కు 6, కాంగ్రెస్ కు 4.. బీఆర్ఎస్ కు 3, బీజేపీకి 2 స్థానాల్ని సొంతం చేసుకునే వీలుందంటున్నారు. నిఘా వర్గాల తాజా అంచనాల ప్రకారం నగరంలో మారిన సమీకరణాల్నిచూస్తే.. ఇంతవరకు జిల్లాల్లో వీస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ గాలి.. తొలిసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెంట్రల్ నగరంలోనూ వీస్తుందన్న విషయాన్ని నిఘా వర్గాలు సిద్ధం చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ రిపోర్టు వాస్తవ రూపం దాలిస్తే మాత్రం.. అధికార బీఆర్ఎస్ కు ఇంతకు మించిన షాకింగ్ అంశం మరింకేమీ ఉండదని చెప్పకతప్పదు. మరి.. నిఘా రిపోర్టుగా చెబుతున్న ఇందులోని అంశాలు ఎంతవరకు నిజమన్న విషయం తేలాలంటే.. డిసెంబరు 3 వరకు వెయిట్ చేయక తప్పదు.