గ్యారెంటీలకు స్పెషల్ ఆపీసర్లా ?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ ఎంతటి కీలకపాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు
By: Tupaki Desk | 12 Dec 2023 5:30 PM GMTకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ ఎంతటి కీలకపాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి 100 రోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ అమల్లోకి తెస్తామని రేవంత్ రెడ్డి అండ్ కో హామీలిచ్చారు. అప్పట్లో చెప్పినట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం అమలును రు. 5 లక్షల నుండి రు. 10 లక్షలకు పెంచారు.
ఇక మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలుకు రేవంత్ సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ధిక పరిస్ధితితో సంబంధంలేకుండానే ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందనటంలో సందేహంలేదు. అందుకనే సిక్స్ గ్యారెంటీస్ అమలుకు ప్రత్యేకంగా స్పెషల్ ఆపీసర్లను నియమించాలని రేవంత్ డిసైడ్ అయ్యారట. గతంలో కేసీయార్ హయాంలో అమలైన దళితబంధు, బీసీబంధు, ఆసరా లాంటి అనేక పథకాల్లో బారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
భారీ అవినీతికి కారణాల్లో లబ్దిదారుల ఎంపికను ఎంఎల్ఏల చేతుల్లో పెట్టడమే. లబ్దిదారుల ఎంపిక ఎప్పుడైతే ఎంఎల్ఏల చేతికి వచ్చిందో వెంటనే చాలామంది విజృంభించారు. పథకాలను తమిష్టం వచ్చినట్లు అమలుచేశారు. దాంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సిక్స్ గ్యారెంటీస్ అమలుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించాలని డిసైడ్ అయ్యారట. ఐఏఎస్ అధికారుల చేతుల్లో పథకాల అమలు బాధ్యతను ఉంచితే వారిలో జవాబుదారీతనం ఉంటుందని రేవంత్ ఆలోచించినట్లు సమాచారం.
తెలంగాణా ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుంటే సిక్స్ గ్యారెంటీస్ అమలు అంత ఈజీకాదు. అందుకనే పధకాల అమలుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమిస్తే పథకాల అమలు పక్కాగా ఉంటుందని రేవంత్ ఆలోచించారట. ఈ విషయమై తొందరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 14వ తేదీ మొదలై 18వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సిక్స్ గ్యారెంటీస్ అమలుకు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను ఫైనల్ చేస్తారని సమాచారం.