Begin typing your search above and press return to search.

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌.. రసవత్తరంగా డిజిటల్‌ యుద్ధం.. వీడియో వైరల్‌!

ఈ నేపథ్యంలో ఒక పార్టీ విడుదల చేసిన పాత్రల డైలాగులను మార్చి మరో పార్టీ అదే పాత్రలతో ఇంకో వీడియోను విడుదల చేసింది

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:44 AM GMT
బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌.. రసవత్తరంగా డిజిటల్‌ యుద్ధం.. వీడియో వైరల్‌!
X

నవంబర్‌ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇంకా ఎన్నికలకు 11 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీల ప్రధాన నేతలు, అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఇస్తున్న డిజిటల్‌ ప్రకటనలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికారం కోసం నువ్వా? నేనా? అనే రీతిలో తలపడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డిజిటల్‌ యుద్ధానికి తెరలేపాయి.

ఈ నేపథ్యంలో ఒక పార్టీ విడుదల చేసిన పాత్రల డైలాగులను మార్చి మరో పార్టీ అదే పాత్రలతో ఇంకో వీడియోను విడుదల చేసింది. ఇప్పుడీ ఈ వీడియో వైరల్‌ గా మారింది. మొదటి వీడియోను బీఆర్‌ఎస్‌ విడుదల చేయగా అదే పాత్రలకు డబ్బింగ్‌ డైలాగులను చేర్చి కాంగ్రెస్‌ పార్టీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

ఇంతకీ బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన వీడియోలో ఏముందంటే.. డైరెక్టర్‌ పాత్రధారి ఒక కుర్చీలో ఆరాంగా కూర్చుని పాప్‌ కార్న్‌ తింటూ ఉంటారు. వీడియో ఎడిటర్‌ పాత్రధారి కంప్యూటర్‌ లో వీడియోను ఎడిట్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో డైరెక్టర్‌ పాత్రధారి.. ''స్కాములే చేయాలి.. రాష్ట్రాన్నే మింగాలి'' అంటూ ఒక పాటలా పాడుకుంటూ ఉంటాడు. ఇంతలో వీడియో ఎడిటర్‌ ఒక వీడియోను కంప్యూటర్‌ లో ఎడిట్‌ చేస్తూ.. ''డైరెక్టర్‌ సార్‌.. ఏంటి డైరెక్ట్‌ సీఎం డూప్‌ నే (ఎడిట్‌ చేస్తున్న వీడియోను ఉద్దేశించి) పట్టుకొచ్చారు. ఒకవేళ వాళ్లు (బీఆర్‌ఎస్‌) కూడా మీ సీఎం క్యాండిడేట్‌ డూప్‌ నే పట్టుకొస్తే'' అంటాడు. దీనికి డైరెక్టర్‌ పాత్రధారి ఎగతాళిగా నవ్వుతూ.. ''అరే మా దాంట్లో (కాంగ్రెస్‌)లో డజను సీఎం క్యాండిడేట్‌ లు ఉన్నార్రా.. అందులో సీఎం ఎవరవుతారో మాకే తెలియదు.. ఇంకా వాళ్లేం చెప్తార్రా'' అంటాడు. దానికి వీడియో ఎడిటర్‌ పాత్రధారి.. 'ఓహో అయితే అదా మీ కాన్ఫిడెన్స్‌' అని అంటాడు. దానికి డైరెక్టర్‌ పాత్రధారి.. 'అవును' అని చెప్తాడు. అలాగే ఈసారి నీ ఓటు మాకేగా అని ఎడిటర్‌ తో అంటాడు. దానికి ఎడిటర్‌ పాత్రధారి.. ''హీరో లేకపోతే నేను సినిమాకే పోను.. అసలు అసువంటిది లీడరే లేని మీ పార్టీకి నేనేందుకు ఓటేస్తాను సార్‌.. ఓటేయను'' అంటాడు. దానికి డైరెక్టర్‌.. ''నీలాంటి వాళ్ల వల్లేరా ఈ వీడియోలు చేస్తున్నాం.. నెగిటివ్‌ ఉండాలి.. వీడియోను నెగిటివ్‌ చేయి'' అని కోపంగా అంటాడు. దీంతో ఇక ఆ డిజిటల్‌ వీడియో ముగుస్తుంది. ''ఇలాంటి అసమర్థులతో మనకు రిస్క్‌ వద్దు.. మన కేసీఆర్‌ కే ఓటు గుద్దు'' అంటూ వాయిస్‌ వినిపిస్తుంది.

ఇక బీఆర్‌ఎస్‌ వీడియోకు కౌంటర్‌ గా కాంగ్రెస్‌ కూడా ఇదే పాత్రలకు డబ్బింగ్‌ డైలాగులు పెట్టి వీడియోను విడుదల చేసింది. ఇందులో.. కేటీఆర్‌ పాత్రధారి పాప్‌ కార్న్‌ తింటూ... ''స్కామ్‌ లే చేయాలి.. రాష్ట్రాన్నే మింగాలి'' అంటూ పాడుకుంటూ ఉంటాడు. దీనికి కంప్యూటర్‌ లో వీడియోను ఎడిట్‌ చేస్తున్న వీడియో ఎడిటర్‌... ''కేటీఆర్‌ దొర అదేంటి.. సీఎంగా మీ అయ్యను చూపిస్తున్నారు.. అసలు పెద్ద దొర మిమ్మల్ని కదా సీఎం చేస్తానన్నాడు'' అని అంటాడు. దానికి కేటీఆర్‌ పాత్రధారి.. నవ్వుతూ ''ఎవడు మా వాడా... ఇప్పటికే మా ఇంట్లో నలుగురు సీఎంలు ఉన్నార్రా.. ఇప్పుడు నేను సీఎం అంటే మా చెల్లి కూడా పార్టీలో ఉండదు.. ఇప్పుడు గట్లానే అనాలే'' అని అంటాడు. దానికి వీడియో ఎడిటర్‌ పాత్రధారి.. '' అందుకా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయనిది'' అంటాడు. దానికి కేటీఆర్‌ పాత్రధారి.. ''ఔర్రా ఎడిటర్‌.. ఈసారి నీ వోట్‌ మాకే కదా'' అని అడుగుతాడు. దానికి వీడియో ఎడిటర్‌ పాత్రధారి.. ''మీరు సీఎం అంటే మీ చెల్లే ఒప్పుకోదంటిరి.. అలాంటిది మ్యాటర్‌ లేని మీకు నేనెట్లా ఓటేస్తాను'' అంటాడు.

దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్‌ పాత్రధారి.. ''నీలాంటి వాళ్ల కోసమేరా ఈ వీడియోలు.. నన్ను లేపు.. బాగా లేపు.. బీజీఎంలు వేసి మరీ లేపు (కంప్యూటర్‌ లో వీడియోను చూపిస్తూ).. సోషల్‌ మీడియాలో హల్చల్‌ ఉండాలే'' అని వీడియో ఎడిటర్‌ ను ఆదేశిస్తాడు. దీంతో ఆ వీడియో ముగుస్తుంది. ఇక కాంగ్రెస్‌ వీడియో చివరలో ''ఇలాంటి అహంకారులతో రిస్క్‌ వద్దు.. కాంగ్రెస్‌ కే ఓటు గుద్దు'' అనే వాక్యాలు కనిపిస్తాయి. ఇలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ల మధ్య డిజిటల్‌ యుద్ధం రసవత్తరంగా సాగుతోంది.