కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థుల మెజార్టీ ఎంత?
మరే పార్టీలో లేని విధంగా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడే వారి లెక్క ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By: Tupaki Desk | 3 Dec 2023 8:12 AM GMTమరే పార్టీలో లేని విధంగా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడే వారి లెక్క ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శతాధిక వయసున్న ఈ పార్టీకి ఇదో శాపంగా చెబుతారు. ఎందుకంటే.. ఓడినప్పుడు ఎవరు పెద్దగా కనిపించరు. పార్టీ బాధ్యత మోసేందుకు.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎవరూ పెద్దగా శ్రమించరు. కానీ.. పార్టీ గెలిస్తే మాత్రం.. మేమంటే.. మేం అంటూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీ పడుతుంటారు.
తెలంగాణలోనూ ఇప్పుడు అలాంటి సీనే ఉంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ కాడి పట్టుకోవటానికి ముందుకు వచ్చినోళ్లు లేరు. ఇలాంటి వేళ.. ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి కాంగ్రెస్ జోరు పెరగటమే కానీ తగ్గింది లేదు. తాజా ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకునేలా అడుగులు వేస్తోంది.
తాజాగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యతలో ముందుకు వెళుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కుర్చీని ఆశిస్తున్న వారిజాబితా ఎక్కువగానే ఉంది. మరి.. ఎన్నికల ఫలితాల వేళ వారి పరిస్థితి ఎలా ఉందన్న విషయానికి వస్తే..
రేవంత్ రెడ్డి రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఒక చోట 32800+ మెజారిటీ తో నెగ్గారు రెండవ చోట ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడే బీజేపీ అభ్యర్థి ముందంజలోకి వచ్చాడు . కోమటి రెడ్డి వెంకటరెడ్డి 45వేల మెజార్టీతో ఉంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి 20వేల మెజార్టీతో ఉన్నారు. సీఎం అభ్యర్థిగా బాగా పేరు వినిపిస్తున్న భట్టివిక్రమార్క మాత్రం 8వేల మెజార్టీతోనే ఉన్నారు. ఇక.. తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు మరో ముఖ్యమంత్రి అభ్యర్థి సీతక్క. ఇలా.. ముఖ్యమంత్రి కుర్చీ కోసం రేసులో ఉన్న నేతలంతా విజయం దిశగా పయనిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.