వైసీపీ గెలవాలని బీఆర్ఎస్.. ఓడాలని కాంగ్రెస్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా? కూటమి విజయదుందుభి మోగిస్తుందా? అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.
By: Tupaki Desk | 24 May 2024 10:30 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా? కూటమి విజయదుందుభి మోగిస్తుందా? అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఏపీలో కూటమినే అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం ఓ పార్టీ ఏమో వైసీపీ గెలవాలని, మరో పార్టీ ఏమో కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయనే టాక్ వినిపిస్తోంది.
జగన్‌కు మంచి స్నేహితుడైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందనే సమాచారం ఉందని కేసీఆర్ రెండుమూడు సార్లు చెప్పారు. దీన్ని బట్టి జగన్ గెలుపును ఆయన ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ బలపడాలంటే ఏపీలో వైసీపీ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జగన్ సన్నిహితంగా ఉండే అవకాశం లేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు ఇతర విషయాల్లో గొడవలు జరుగుతాయి. వీటిని అడ్డం పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చిన కేసీఆర్ అనుకుంటున్నారని తెలిసింది.
అదే కూటమి గెలిస్తే ఏపీలో చంద్రబాబు సీఎం అవుతారు. అప్పుడు రేవంత్‌రెడ్డి, బాబు మధ్య ఎలాంటి వివాదాలు ఉండవు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లు ఆలోచిస్తారు. సానుకూల వాతావరణంలోనే సమస్యలను పరిష్కరించుకుంటారు. అదే జరిగితే అప్పుడు బీఆర్ఎస్‌కు గొంతు చిచ్చుకునేందుకు ఎలాంటి అవకాశం దొరకదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీలో వైసీపీ ఓటమిని కోరుకుంటున్నారు. తిరుమల వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా.. ఆంధ్రాతో కొట్లాట కోరుకోవట్లేదని, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునే ప్రభుత్వం ఇక్కడ రావాలని అన్నారు. అంటే కూటమి గెలవాలని రేవంత్ పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.